KTR VS Bandi Sanjay: తెలంగాణలో సంచలనం.. బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:56 PM
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు బిగ్ షాక్ ఇచ్చారు. బండి సంజయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు కేటీఆర్.
హైదరాబాద్ , సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) బిగ్ షాక్ ఇచ్చారు. బండి సంజయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్లకు దావా పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ మేరకు కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, డిసెంబర్ 15వ తేదీకి విచారణను వాయిదా వేసింది సిటీ సివిల్ కోర్టు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడంతోనే ఈ పరువునష్టం దావా వేశారు.
ఎమ్మెల్యేల ఫోన్లు, తన కుటుంబసభ్యుల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేయించారని గతంలో బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ ఆరోపణలపై ఆగస్టులో కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ నుంచి నోటీసులకు రిప్లై రాకపోవడంతో తాజాగా పరువు నష్టం దావా వేశారు.
కేటీఆర్ ఫిర్యాదులోని ముఖ్యాంశాలు:
'2025 ఆగస్టు 8న బండి సంజయ్ తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎస్ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక అవకతవకలకు నన్ను ముడిపెట్టారు. సంజయ్ వ్యాఖ్యలను పలు టీవీ ఛానెళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్/ఇన్‌స్టాగ్రామ్) వంటి సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు కేవలం పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయి' అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ డిమాండ్ చేసిన పరిహారాలు
బండి సంజయ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి.
తదుపరి పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలి.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా పోర్టల్స్ నుంచి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News