KTR Warns Telangana Police: పోలీసులు రేవంత్‌రెడ్డికి కట్టు బానిసలుగా పనిచేస్తున్నారు.. కేటీఆర్ ఫైర్
ABN , Publish Date - Jul 26 , 2025 | 06:44 PM
ఫోన్ ట్యాపింగ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తున్నాయని.. తాము కూడా ట్యాపింగ్ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని గుర్తుచేశారు. అధికారులు ట్యాపింగ్ చేస్తే చేయొచ్చని రేవంత్‌రెడ్డి అన్నారని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై (Telangana Police) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చేయాల్సిన పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇవాళ(శనివారం జులై26) హైదరాబాద్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్పీ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఎవరూ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో కనుక్కోవడమే పోలీసుల పనిగా మారిందని విమర్శించారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఘోరంగా ఉందని ఆరోపించారు. పోలీసుల మెడకాయపైన తలకాయ ఉన్న పనే చేస్తున్నారా? అని నిలదీశారు. పోలీసులు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి కట్టు బానిసలుగా పనిచేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కేటీఆర్. అధికారం శాశ్వతం కాదని.. రేవంత్ బానిసలుగా పని చేస్తున్న ఒక్కో పోలీసు పేరు రాసి పెట్టుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకి పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు వడ్డీతో సహా కలిపి చెల్లిస్తామని హెచ్చరించారు. బనకచర్ల ప్రాజెక్ట్ ఆపేదాక తాము పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు మాజీ మంత్రి కేటీఆర్.
తెలంగాణ నీటి వాట మనకి ఇచ్చిన తర్వాత ఎవరు ఏ ప్రాజెక్ట్ కట్టుకున్నా మనకి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రాజెక్ట్ కడుతామంటే ఎలా? అని ప్రశ్నించారు. పోస్ట్ కార్డు, ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా మన డిమాండ్ తెలియ చేద్దామని అన్నారు. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయని.. తాము కూడా ట్యాపింగ్ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని గుర్తుచేశారు. అధికారులు ట్యాపింగ్ చేస్తే చేయొచ్చని రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు. రేవంత్ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తే అధికారుల తప్పా? అని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తే కేసీఆర్, కేటీఆర్‌లది తప్పా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నాట్ల సమయంలో రైతుబంధు ఇస్తే... రేవంత్‌రెడ్డి ఓట్లప్పుడు ఇస్తున్నారని విమర్శించారు. మనకి సోషల్ మీడియా సపోర్ట్ తప్పా.. ఏ మీడియా సపోర్ట్ లేదని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో మన తడాఖా చూపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News