Share News

Kamareddy BC Reservation Meeting: కవిత లిక్కర్ రాణిగా జిల్లాకు చెడ్డపేరు తెచ్చారు..

ABN , Publish Date - Sep 07 , 2025 | 05:39 PM

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.. భారీ వర్షాలకు కామారెడ్డిలో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద పరిశీలనకు వస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ గురించి మాట్లాడినట్లు గుర్తు చేశారు.

Kamareddy BC Reservation Meeting: కవిత లిక్కర్ రాణిగా జిల్లాకు చెడ్డపేరు తెచ్చారు..
TPCC Chief Mahesh Kumar Goud

కామారెడ్డి: జిల్లా కేంద్రంలో ఐదుగురు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పర్యటించారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ఈ మేరకు ఇందిరాగాంధీ స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాలను సందర్శించారు. బీసీ డిక్లరేషన్ సభకు ఇందిరా గాంధీ స్టేడియం స్థలం సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా డిగ్రీ కళాశాల మైదానం పరిశీలించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సభా స్థలాన్ని ఫైనల్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.


బీసీ రిజర్వేషన్లకు అండగా ఉన్నారు..

ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలకు కామారెడ్డిలో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద పరిశీలనకు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ గురించి మాట్లాడినట్లు గుర్తు చేశారు. బీసీ డిక్లరేషన్‌‌ సభకు తానే బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయిన రోజైన ఈనెల 15న సభ పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే భారీ సభకు ప్లాన్ చేసినట్లు స్పష్టం చేశారు. అన్ని వర్గాల నాయకులు బీసీ రిజర్వేషన్లకు అండగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు.


బండి సంజయ్‌కు సవాల్..

బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టం కాకుండా.. బీజేపీ నాయకులు ఆపుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ నాయకులు దేవుడి పేరిట ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్ళని విమర్శించారు. తామూ పూజలు చేస్తాం, గుళ్లకు వెళ్తాం.. కానీ దేవుళ్ల పేరిట ఓట్లు అడగమని ఎద్దేవా చేశారు. బీసీల రిజర్వేషన్ వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బండి సంజయ్ నడవడి, నిర్ణయం బీసీ బిడ్డలాగా లేదని మండిపడ్డారు. తనని సెక్యూరిటీ కోసం తిరుగుతున్నానని అంటున్న బండి సంజయ్‌‌కు ఇద్దరం సెక్యూరిటీ వదిలేసి జనంలో తిరుగుదాం రా.. అంటూ సవాల్ విసిరారు. బీసీ బిడ్డగా రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు.


కవిత లిక్కర్ రాణి..

తాము ప్రకటించిన బీసీ బిల్లుకు(చట్టంగా చేయాలనుకుంటున్న) చట్టబద్ధత చేయించండని బీజేపీ కేంద్ర మంత్రులను మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల బాగోతం బయటపెట్టడానికే కామారెడ్డిలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంపై శంఖారావం పూరించడానికి.. 15న సమరానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆరా తీసే స్థాయిలో సభ జరగాలని సూచించారు. మరోవైపు జిల్లా కోడలు మాజీ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ రాణిగా జిల్లాకు చెడ్డపేరు తెచ్చారని ఎద్దేవా చేశారు.

పదేళ్లుగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. సాక్షాత్తూ కవిత ఈ దోపిడీని బయట పెట్టారని గుర్తు చేశారు. వాటాల్లో తేడాలు రావడంతో కవిత పార్టీ నుంచి బయట పడ్డారని విమర్శించారు. కవిత తాము చేసిన దోపిడీని ఒప్పుకున్నారన్నారు. ఈ విషయం ఐదేళ్ల క్రితం చెప్పి ఉంటే సన్మానం చేసే వాళ్లమని పేర్కొన్నారు. కవిత విషయం కూడా కేసీఆర్ ఆడిస్తున్న నాటకం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం అంతా దొంగలే.. అని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ పిలిస్తే కవిత వెళ్లదా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని రెండేళ్ల కిందట చెప్పానని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహేశ్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌ సన్మానం

నిమజ్జనోత్సవంలో రేవంత్‌

Updated Date - Sep 07 , 2025 | 06:08 PM