Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అప్‌డేట్.. తుది ఓటర్ల జాబితా విడుదల
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:36 PM
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ కీలక చర్యలు చేపట్టింది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది. జాబితాను CEO సుదర్శన్ రెడ్డి ఇవాళ(మంగళవారం) విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో మొత్తం ఓటర్లు 3 లక్షల 99 వేలు ఉన్నట్లు తెలిపారు. జూలై 1న అర్హత తేదీగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ చేసినట్లు పేర్కొన్నారు. సవరణ అనంతరం జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు, 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), 1,891 మంది దివ్యాంగులు ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా, 139 కేంద్రాల్లో 409 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు CEO సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ కీలక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు పూర్తి చేసింది. జూబ్లీహిల్స్‌కు జరుగుతోంది ఉపఎన్నిక అయినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆశించినన్ని సీట్లు దక్కకపోవడంతో.. ఈ ఉపఎన్నికతో నగరంలో తన ఉనికి చాటుకోవాలని చూస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్న సీటును కాపాడుకోవాడానికి వ్యూహాలు రచిస్తోంది. అయితే.. తుది జాబితా విడుదల కావడంతో త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం