Share News

Hyderabad Metro Timings: గణేశ్ నిమజ్జనం వేళ.. ప్రయాణికులకు శుభవార్త

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:11 PM

గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్‌ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.

Hyderabad Metro Timings: గణేశ్ నిమజ్జనం వేళ.. ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం వేళ పండగ వాతావరణం నెలకొంది. వినాయకులను అంగరంగ వైభవంగా అలంకరించి గణేష్ శోభ యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు(శనివారం) మెట్రో సమయంలో మార్పులు చేస్తూ.. అధికారులు ప్రకటన విడుదల చేశారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రేపు(శనివారం) ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలు వెళ్లిన వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


రేపు ఒంటి గంట లోపు బడా గణేష్ నిమజ్జనం..

గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్‌ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు. విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. వినాయకులు వెళ్ళడానికి నగరంలో మ్యాప్ వేసుకొని రూట్స్ డిసైడ్ చేశామని చెప్పారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు అనుసరించాలని పేర్కొన్నారు.

రోడ్లపై డైవర్షన్ ఉన్న చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశామని, వాటి అనుగుణంగా వినాయకులను తీసుకెళ్లాలని సూచించారు. నిమజ్జనం సమయంలో.. 29 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. రేపు(శనివారం) మధ్యాహ్నం 1 గంట లోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తామని వెల్లడించారు. మండప నిర్వాహకులు తొందరగా బయలుదేరి రావాలని సూచించారు. రేపు సుమారు 50వేల విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని అంచనా వేసినట్లు సీపీ వివరించారు. ఉత్సవాల నేపథ్యంలో గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిమజ్జనాలకు సంబంధించి చెరువులను, కొలనులను పరిశీలించినట్లు చెప్పారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.


పోలీసులకు సహకరిస్తాం..

రేపు(శనివారం) గణేశ్‌ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు. నగర వ్యాప్తంగా నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను అధికారులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఖైరతాబాద్ నిమజ్జనం చూడటానికి 40 లక్షల మంది భక్తులు శోభాయాత్ర పాల్గొంటారని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదాలు, తాగునీటి వసతి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసుల సహకారంతో పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ..

మాజీసీఎం సంచలన కామెంట్స్.. రాసిపెట్టుకోండి.. స్టాలిన్‌ కల ఫలించదు

Updated Date - Sep 05 , 2025 | 05:55 PM