Hyderabad Rain Effect: భారీ వర్షాలు.. వణుకుతున్న భాగ్యనగరం..
ABN , Publish Date - Aug 14 , 2025 | 07:07 PM
హిమాయత్ సాగర్ 10 గేట్లను అధికారులు తెరిచారు. దీంతో కుల్సుంపురా ప్రాంతంలోని మూసీ నది రోడ్డు వరదలకు గురైంది. వెంటనే అధికారులు రోడ్డును మూసివేసి వాహనాలను దారి మళ్లించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కురుస్తున్న నేపథ్యంలో భాగ్యనగరం భయంతో వణుకుతోంది. వర్షాల ధాటికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఈ మేరకు అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ 10 గేట్లను అధికారులు తెరిచారు. దీంతో కుల్సుంపురా ప్రాంతంలోని మూసీ నది రోడ్డును వరదనీరు ముంచెత్తింది. వెంటనే అధికారులు రోడ్డును మూసివేసి వాహనాలను దారి మళ్లించారు. అయితే గేట్లు ఓపెన్ చేయడంతో నీటితోపాటు పురుగులు, పాములు సైతం రోడ్లపైకి కొట్టుకువస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిమాయత్ సాగర్ నుంచి మూసీ నదిలోకి వరద నీరు వదలడంతో పురాణ ఫుల్ స్మశాన వాటికలోకి నీరు వచ్చి చేరింది. దీంతో అంత్యక్రియలకు విఘాతం చోటుచేసుకుంది.

అయితే, తాజాగా మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చింది మూసి. దీంతో జియాగూడ, పురానా ఫూల్ రోడ్డు మార్గం పూర్తిగా నీట మునిగింది. చాదర్ ఘాట్, శంకర్ నగర్ బస్తీలలో మూసీ వరదనీరు ఇళ్లలోకి చేరింది. దీంతో అధికారులు అక్కడి ప్రజలను ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, బేగంబజార్ మార్కెట్‌లోని సంతోషిమాత దేవాలయం సమీపంలో ఉన్న 100 సంవత్సరాల పురాతన భవనం గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ పురాతన భవనంలో గత 20 సంవత్సరాలుగా ఎవరూ నివాసం ఉండడం లేదు. ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు భవన శిథిలాలను తొలగిస్తున్నారు. అదేవిధంగా గోషామాల్ నియోజవర్గంలో పురాతన భవనాల్లో వ్యాపారాలు చేస్తున్న వారిని వెంటనే దుకాణాలను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ