GHMC Road Digitization: జీహెచ్ఎంసీ న్యూ టెక్నాలజీ.. ఇక రహదారులకు డిజిటల్ ఐడీ
ABN , Publish Date - Sep 01 , 2025 | 08:49 AM
రహదారులు నిర్మించకుండానే పనులు చేసినట్టు, గుంతలు పూడ్చకుండానే మరమ్మతు పూర్తయినట్టు బల్దియా ఖజానాను కొల్లగొడుతున్న ఆక్రమార్కులకు చెక్‌పెట్టేలా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక రోడ్ల డిజిటలైజేషన్
చేయని పనుల బిల్లుల చెల్లింపునకు చెక్
మొబైల్ యాప్ ద్వారా సమగ్ర సమాచారం
అక్రమాలకు చెక్ పెట్టేలా జీహెచ్ఎంసీ నిర్ణయం
ప్రజాధనం వృథాను కాపాడేలా కార్యాచరణ
త్వరలో క్షేత్రస్థాయి సర్వే.. యాప్‌లో వివరాలు
అధికారులు, ఏజెన్సీల సమాచారం కూడా
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రహదారులు నిర్మించకుండానే పనులు చేసినట్టు, గుంతలు పూడ్చకుండానే మరమ్మతు పూర్తయినట్టు బల్దియా ఖజానాను కొల్లగొడుతున్న ఆక్రమార్కులకు చెక్‌పెట్టేలా జీహెచ్ఎంసీ (GHMC Road Digitization) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న రహదారుల సమాచారాన్ని ఇక డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది.
స్ట్రెచ్‌ల వారీగా ప్రతి రోడ్డుకు ప్రత్యేక యూనిక్ ఐడీ కేటాయించి, అక్కడ జరిగే పనుల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా సాంకేతిక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్పనకు బల్దియా కసరత్తు చేస్తోంది. పలు ఏజెన్సీలతో ఇప్పటికే ఐటీ విభాగం అధికారులు సంప్రదింపులు జరిపారు. త్వరలో ఏజెన్సీ ఎంపిక జరుగనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించే ఏజెన్సీ సిబ్బంది.. రహదారుల వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఓ అధికారి తెలిపారు.
ఎవరి రోడ్డు..?
గ్రేటర్‌లో 9103 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారులున్నాయి. ఇందులో ప్రభుత్వ విభాగం రోడ్లు ఎన్ని ఉన్నాయి.? వాటిలో ప్రధాన, అంతర్గత రోడ్లు ఏవి.? అన్నది క్షేత్రస్థాయిలో సర్వే చేసి గుర్తించనున్నారు. ప్రస్తుతం నగరంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)లోని ఆర్అండ్ బీ, టీజీఐఐసీ, జీహెచ్ఎంసీ రోడ్లున్నాయి. ఎక్కడ రోడ్డు పాడైనా.. జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. నిర్వహణలో వైఫల్యమవుతోందన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో విభాగాలు, లేన్ల వారీగా రహదారుల డేటాను యాప్‌లో నమోదు చేస్తారు. అనంతరం అక్కడి అధికారుల నంబర్లను డేటాకు అనుసంధానం చేయనున్నారు. స్ట్రెచ్ పై క్లిక్ చేస్తే అది ఏ విభాగానికి చెందిన రహదారి..? సంబంధిత అధికారి ఎవరు..? రోడ్డును ఎప్పుడు నిర్మించారు..? ఏ ఏజెన్సీ పనులు చేపట్టింది..? డీఎల్పీ ఎన్ని రోజుల వరకు ఉంది..? తదితర వివరాలూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఐటీ విభాగం అధికారొకరు తెలిపారు. డిజిటైజేషన్ ద్వారా రహదారుల పక్కా సమాచారం అందుబాటులో ఉండటంతోపాటు.. అక్రమాలను నియంత్రించే అవకాశం ఉంటుందని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..
Read latest Telangana News And Telugu News