Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. నీటమునిగిన పంట పొలాలు
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:04 AM
సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలల్లో వరి పంటకు అపార నష్టం వట్టిల్లింది. చేర్యాల మండలంలో.. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిస్తున్నాయి. హుజురాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేశవపట్నం వాగు ఉప్పొంగడంతో ఐకేపీ కేంద్రం గోడ కూలి నిల్వ ఉంచిన వరి ధాన్యం కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. వాగు ఉప్పొంగడంతో.. సైదాపూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. హుజురాబాద్‌లో కూడా చిలుకవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. జూపాక రోడ్డు తెగి పోయింది. భారీ వర్షం కారణంగా రోడ్డుపై ఆరబెట్టిన వడ్లు కూడా కొట్టుకుపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే.. సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలల్లో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. చేర్యాల మండలంలో.. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ముస్త్యాల వద్ద రాగికుంట పొంగిపొర్లడంతో చేర్యాల - హుస్నాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా.. భారీగా ధాన్యం తడిసినట్లు రైతులు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దూర్‌లో 22 సెం.మీ, దూల్మిట్ట 19 సెం.మీ, చేర్యాల 17సెం.మీ, కొమురవెళ్లి 12సెం.మీల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
మొంథా తుఫాన్ కారణంగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. కుండపోత వర్షాలకు వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. దీంతో ఆ రూట్‌ని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు.
తుఫాన్ ప్రభావంతో వరంగల్, హనుమకొండ తడిసి ముద్దయింది. ఈ మేరకు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలా జిల్లాల్లో వరి ధాన్యం, మొక్క జొన్న పంటలు, చేతి కొచ్చిన పత్తి పంట తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Home Minister Amit Shah: పీఎం, సీఎం..రెండు పదవులూ ఖాళీ లేవు
Former Bangladesh PM Sheikh Hasina: భారత్‌లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు