Home Minister Amit Shah: పీఎం, సీఎం..రెండు పదవులూ ఖాళీ లేవు
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:08 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం బిహార్‌లో సుడిగాలి పర్యటన చేశారు. దర్భంగా, సమస్తీపూర్, బెగుసరాయ్ నగరాల్లో ఎన్నికల ప్రచార సభల్లో...
బిహార్ ఎన్నికల ప్రచార సభల్లో లాలూ, సోనియాపై అమిత్ షా విమర్శ
పట్నా, అక్టోబరు 29: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం బిహార్‌లో సుడిగాలి పర్యటన చేశారు. దర్భంగా, సమస్తీపూర్, బెగుసరాయ్ నగరాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తూ ఇండియా కూటమిపై విమర్శలు సంధించారు. ‘బిహార్‌లో బీజేపీ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మైథిలీ ఠాకూర్ వంటి అనేక మంది యువతకు టికెట్లు ఇచ్చింది. కానీ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే లాలూజీ ఆయన కుమారుడు తేజస్విని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. సోనియాజీ ఆమె తనయుడు రాహుల్ ప్రధాని కావాలనుకుంటున్నారు. అయితే ఆ రెండు పదవులూ ఖాళీ లేవని వారు తెలుసుకోవాల’ని అమిత్ షా వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ వివిధ కుంభకోణాల కేసుల్లో కూరుకుపోగా, కాంగ్రె్‌సపై రూ.12 లక్షల కోట్ల అవినీతి కేసులు ఉన్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. చొరబాటుదారుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండాలని రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్‌లు కోరుకుంటుండగా... బిహార్‌లో మళ్లీ ఆటవిక రాజ్యం తేవాలన్నది తేజస్వి, రాహుల్ ఉద్దేశమని విమర్శించారు. కాంగ్రె్‌స-ఆర్జేడీ అధికారంలోకి వస్తే జైళ్లలో ఉన్న నిషేధిత రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎ్‌ఫఐ) సభ్యులను వదిలేస్తారని ఆరోపించారు. కాగా, పాట్నా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రసంగించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి (నవంబరు 14) నాడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే విషయాన్ని గుర్తుచేస్తూ.. ఎన్‌డీయేకు మూడింట రెండొంతుల మెజారిటీ ఇవ్వడం ఆయనకు సరైన నివాళి అని వ్యాఖ్యానించారు. నెహ్రూ తమ పార్టీకి చెందిన నాయకుడు కాకపోయినా దేశ తొలి ప్రధానిగా ఆయనను గౌరవిస్తానన్నారు.