Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో కాంగ్రెస్ నుంచి వీరికే సీటు
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:52 PM
తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజధానిలో ఈ ప్రతిష్టాత్మక స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో టికెట్ రేస్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ రేస్ నుంచి తప్పుకోవడం, బీసీలకు టికెట్ ఇవ్వాలన్న టీపీసీసీ నిర్ణయం ఈ ఎన్నికను మరింత ఆసక్తికరంగా మార్చాయి.
తెలంగాణలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jubilee Hills By Election 2025) గురించి కీలక అఫ్డేట్ వచ్చేసింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దాదాపు ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాజాగా భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదిలా ఉండగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను సిఫార్సు చేయడం కూడా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
పోటీలో ఇద్దరు
ఈ సిఫారసుతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న అజారుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్ టికెట్ కోసం మరో ఇద్దరు ప్రధాన అభ్యర్థులు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ మిగిలారు. ప్రస్తుతం, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ నిర్ణయం మేరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్‌లలో ఎవరు పార్టీ అభ్యర్థిగా ఉంటారనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
రేసులో మొదటగా..
ఇప్పుడు రేస్‌లో ముందుండేది నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్. బొంతు రామ్మోహన్.. మాజీ జీహెచ్‌ఎంసీ మేయర్, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి పనుల్లో అనుభవం ఉంది. నవీన్ యాదవ్.. యువ నాయకుడు, ఎప్పటినుంచో స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అంతేకాదు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో AIMIM పార్టీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇద్దరూ కూడా బీసీ వర్గానికి చెందినవారు. టీపీసీసీ బీసీలకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించడంతో ఈ ఇద్దరిలో ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేసే ఛాన్సుంది. అయితే వీరిలో నవీన్ యాదవ్‌ను ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
ఉప ఎన్నిక ఎందుకు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (బీఆర్‌ఎస్) ఇటీవల గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కానీ, ఈ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే, రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఉపఎన్నిక ఇది. ఇక్కడి ఫలితం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మనోధైర్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి