Share News

CM Revanth Reddy: మా ప్రభుత్వంలో మహిళా సంఘాలకు ప్రోత్సాహం

ABN , Publish Date - May 17 , 2025 | 02:13 PM

CM Revanth Reddy: దేశానికి మహిళలు ఆదర్శం, మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించినా ఘనత కాంగ్రెస్‌దని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

CM Revanth Reddy: మా ప్రభుత్వంలో మహిళా సంఘాలకు ప్రోత్సాహం
CM Revanth Reddy

హైదరాబాద్: దేశాన్ని గెలిపించిన శక్తి .. మహిళలదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఇండియా, చైనా యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగిన సమయంలోనూ ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం) జూబ్లీహిల్స్​ జేఆర్​సీ కన్వెన్షన్‌లో వి హబ్ (WE Hub) విమెన్​ యాక్సిలరేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళా శక్తిని కాంగ్రెస్ (Congress) ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.


దేశానికి మహిళలు ఆదర్శం… మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించినా ఘనత కాంగ్రెస్‌దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళలకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నజరానా అందించారని గుర్తుచేశారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


మహిళా సంఘాలకు భరోసా..

‘విద్యార్థుల యునిఫార్మ్ కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా అందించాం. వ్యాపారంలో మహిళలను ప్రోత్సహిస్తున్నాం. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్‌ను కేటాయించాం. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని మేం నమ్ముతున్నాం. స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి పెంచుకోవాలని కోరుతున్నా. మీ రేవంతన్నగా మీకు ప్రోత్సాహం అందిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


ఆర్ధిక క్రమశిక్షణ మా ఆడబిడ్డల సొంతం..

‘దేశంలో రూ.16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారు. కానీ ఆడబిడ్డలకు అప్పు ఇస్తే.. ఒక్క రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ మా ఆడబిడ్డల సొంతం. ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించాం. మీరు సమర్ధవంతంగా నిర్వహిస్తే అవసరమైతే మరో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలను ప్రోత్సహించడమే మా ప్రభుత్వ విధానం. పట్టణ ప్రాంతాల్లోని మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

High Court: 132 కిలోల మత్తుపదార్థాల పట్టివేత కేసులో బెయిల్‌ ఇవ్వలేం: హైకోర్టు

Fake Cotton Seeds: 40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2025 | 02:28 PM