Share News

KTR: సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

ABN , Publish Date - May 17 , 2025 | 04:39 AM

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెగించి.. కమీషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లను బయట పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు.

KTR: సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

  • మంత్రి ఆరోపణలపై దర్యాప్తు చేయించగలరా?

  • రాహుల్‌, రేవంత్‌ రెడ్డిలను ప్రశ్నించిన కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెగించి.. కమీషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లను బయట పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు. మంత్రుల దగ్గర ఏ ఫైల్‌ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ ఎట్టకేలకు నిజం చెప్పారని పేర్కొన్నారు. సురేఖ వ్యాఖ్యలపై శుక్రవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ.. కమీషన్‌ సర్కారు నడిపిస్తోందని వ్యాఖ్యానించారు.


దురదృష్టవశాత్తు ఇది బహిరంగ రహస్యమై పోయిందన్నారు. సొంత పార్టీ మంత్రి చేసిన అవినీతి ఆరోపణలపై సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ దర్యాప్తు చేయించగలరా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ కమీషన్‌ వ్యాపారాన్ని ఎత్తి చూపుతూ సచివాలయం ముందే కాంట్రాక్టర్లు ధర్నాకు దిగడం కాంగ్రెస్‌ సర్కారు అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తుందన్నారు.

Updated Date - May 17 , 2025 | 04:39 AM