Share News

CM Revanth Reddy ON Future City: పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా..: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:44 PM

ఫ్యూచర్ సిటీపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

CM Revanth Reddy ON Future City: పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా..: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy ON Future City

హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్ సిటీ (Future City)పై కొందరూ కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు ఇక్కడ భూములు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణమని ఉద్ఘాటించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) భవనం, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ (ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.


భవిష్యత్తుకు పునాదులు..

ముందుతరాల కోసం చంద్రబాబు, వైఎస్సార్ ఆలోచించారని నొక్కిచెప్పారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ORR వచ్చాయని గుర్తుచేశారు. గతం నుంచి భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఓ మంచి ఆలోచనతో ఈ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు. ఇంకెన్నాళ్లు విదేశాల గురించి మాట్లాడుకుంటాం..? అని ప్రశ్నించారు. పదేళ్ల సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


నిజాం కాలంలో సికింద్రాబాద్‌ అభివృద్ధి

‘మంచి సంకల్పంతో తలపెట్టిన ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవానికి వరుణదేవుడు కూడా సహకరించాడు. ఆనాడు కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారు. నిజాం కాలంలో సికింద్రాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ అభివృద్ధి జరిగింది. గతం నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించుకునేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉండాల్సిన అర్హతలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయబోతున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


మా లక్ష్యం ఇదే..

‘రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం. ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు మీ అందరి సహకారం ఉండాలి.. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. నేను కూర్చుని మీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నా. రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్లి నష్టపోవద్దు. తక్షణమే మీ సమస్యలను పరిష్కరించాలని మా అధికారులను ఆదేశిస్తున్నాను. అందరికీ న్యాయం చేయాలనేదే మా ప్రయత్నం. డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ భవనం, స్కిల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం. అప్పుడు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాం. ప్రపంచంలో ఎవరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చుని మాట్లాడుతా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఇక్కడ పది ఎకరాలు కేటాయించాలని మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుకు సూచన చేస్తున్నాను. 2026 డిసెంబర్‌లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తిచేసుకునేలా చూడాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

బిగ్ బ్రేకింగ్.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 28 , 2025 | 04:52 PM