Share News

CM Revanth Reddy: బతుకమ్మకుంట ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Sep 28 , 2025 | 09:07 PM

ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 2 సెంటిమీటర్ల వర్షాన్ని తట్టుకునే విధంగా గత పాలకులు హైదరాబాద్ స్ట్రక్చర్ నిర్మాణం చేశారని తెలిపారు.

CM Revanth Reddy: బతుకమ్మకుంట ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy

హైదరాబాద్: తాను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొంత మందికి అర్థం కాలేదు.. కొంతమందికి అర్థయినా వారి భూముల కబ్జాలు బయటపడుతాయని వ్యతిరేకించారని తెలిపారు. ఇవాళ(ఆదివారం) అంబర్‌పేటలో పర్యటించిన రేవంత్.. బతుకమ్మకుంట ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. స్వయంగా మొదటి బతుకమ్మను కుంటలో వదిలి బతుకమ్మకుంటను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు.


ప్రస్తుత వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 2 సెంటిమీటర్ల వర్షాన్ని తట్టుకునే విధంగా గత పాలకులు హైదరాబాద్ స్ట్రక్చర్ నిర్మాణం చేశారని తెలిపారు. హైదరాబాద్ ఒకప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్మించుకున్నదని చెప్పుకొచ్చారు. కానీ.. ఇప్పుడు ఒక్క గంటలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుందని వివరించారు. ఆనాడు నగర ప్రజలను కాపాడుకోవడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన ప్రణాళికే మూసీ నది అని గుర్తు చేశారు. కానీ.. కబ్జాల పర్వంలో చెరువులు, నదులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.


అందుకే ప్రభుత్వం, హైడ్రా ఉక్కుపాదంతో తాటతీస్తోందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూసీ నది అభివృద్ధి, తన సొంత లాభం కోసం కాదని పేర్కొన్నారు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని వివరించారు. మూసీ ఉప్పొంగినప్పుడు MGBS మునిగిపోయిందని తెలిపారు. ఇక్కడ ఒక నాయకుడు కబ్జా పెట్టారని మండిపడ్డారు. అతని పేరు చెప్పాల్సిన అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అంతీతంగా కాలేరు వెంకటేష్ పనులు చేయాలని తనని కోరారని చెప్పుకొచ్చారు. అలాగే అందరూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పనులు తన దృష్టికి తెచ్చి పనులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరిక మేరకు హనుమంత రావు పేరు పెట్టడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. బతుకమ్మకుంట కోసం హనుమంతరావు జీవిత ఆశయంగా పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు అంబర్‌పేట బతుకమ్మ కుంటకు వీహెచ్ పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


తుమ్మిడికుంట కబ్జా చేసి N-కన్వెన్షన్‌ నిర్మించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలిసో.. తెలీకో.. చెరువున్న చోట హీరో నాగార్జున కన్వెన్షన్‌ హాల్‌ కట్టారని తెలిపారు. హైడ్రా కూల్చివేసి వివరాలు చెప్పాక నాగార్జున వాస్తవం గ్రహించారని చెప్పుకొచ్చారు. కబ్జా చేసిన రెండెకరాలను ప్రభుత్వానికి ఇచ్చేశారని పేర్కొన్నారు. చెరువుల బాగు కోసం సహకరిస్తానని నాగార్జున హామీ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కరూర్‌ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..

విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?

Updated Date - Sep 28 , 2025 | 09:25 PM