Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:08 PM
కాంగ్రెస్ పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ పదవులతోనే నేతలకు గుర్తింపు, గౌరవమని ఉద్ఘాటించారు. రాజకీయాల్లో నేతల ఎదుగుదలకు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. ఉప ఎన్నికలో మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగుతాయని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కొవాలని దిశానిర్దేశం చేశారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇన్‌చార్జీ మంత్రులు ప్రతి అంశాన్నీ సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉండాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ పదవులు వెంటనే భర్తీ చేయాలన్నారు. పార్టీ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉండాలని హుకుం జారీ చేశారు. పార్టీ పదవులు భర్తీ చేయడంలో టీపీసీసీ చీఫ్ ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నేషనల్ నరేటివ్ బిల్డప్ చేసుకోవాలని సూచించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
దేశంలోనే అన్నిరాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్గాటించారు. కేంద్రప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని వ్యాఖ్యానించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామని చెప్పుకొచ్చారు. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మందితో క్రియాశీలక సభ్యత్వం చేయించానని గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు వరించాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ పదవులతోనే నేతలకు గుర్తింపు, గౌరవమని ఉద్ఘాటించారు. రాజకీయాల్లో నేతల ఎదుగుదలకు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని చెప్పుకొచ్చారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని సూచించారు. మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని మార్గనిర్దేశం చేశారు. గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేదని కొనియాడారు. ఖర్గేని నేతలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ టికెట్ మాగంటి కుటుంబానికే..
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
Read Latest Telangana News And Telugu News