Share News

MP Laxman: మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది..

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:50 PM

పీసీసీ ప్రెసిడెంట్‌‌గా ఉన్న సమయంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీబీఐకి ఆ ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని ఎంపీ లక్ష్మణ్ సూచించారు. కాగ్ కూడా అవినీతి జరిగింది, లోపాలు ఉన్నాయాని చెప్పిందని స్పష్టం చేశారు.

MP Laxman: మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది..

ఢిల్లీ: మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఅరెస్ కూలిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే, బీఆర్ఎస్ మూడు ముక్కలు అయ్యిందని ఎద్దేవా చేశారు. అవినీతి పరులకు బీజేపీలో చోటులేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు విషయంలో కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు. సీబీఐతో దర్యాప్తు చేయాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం విషయంలో 22 నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాలయాపన చేశారో.. తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


పీసీసీ ప్రెసిడెంట్‌‌గా ఉన్న సమయంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీబీఐకి ఆ ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని ఎంపీ లక్ష్మణ్ సూచించారు. కాగ్ కూడా అవినీతి జరిగింది, లోపాలు ఉన్నాయాని చెప్పిందని స్పష్టం చేశారు. ఘోష్ కమిషన్ నివేదికలో క్రిమినల్ రిఫరెన్స్ లేకుండా నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ల పాత్ర ఏంటో స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత బహిరంగంగా హరీష్ రావు, సంతోష్ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పారని గుర్తు చేశారు. హరీష్ రావు, సంతోష్ అవినీతి ఆనకొండలు అని చెప్పిందని స్పష్టం చేశారు.

ఇరువురు తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టారని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు అనేక మంది యువత, ఉద్యోగులు, ప్రజలు తెలంగాణ కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుని, కోట్లకు పడగలు ఎత్తిందని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలి, అవినీతిపరులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌‌ను బలిపశువును చేసారని కవిత అంటున్నారు, అంటే హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి కేసీఆర్‌కు తెలుసా అని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం అవినీతిలో అధికారులు, కాంట్రాక్టులు ఎవరున్నా వారిని శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Sep 02 , 2025 | 02:55 PM