Bandi Sanjay: సింపతీ పెంచే కుట్ర.. సీఎం రేవంత్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:18 PM
కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి తిట్టడం వెనక సింపతీ కుట్ర దాగి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌పై రేవంత్ మాట్లాడిన భాష సరైంది కాదన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 25: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR)లపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష సరైంది కాదన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే ముందు జాగ్రతగా ఉండాలని.. అంతేకానీ ఇలా దిగజారి మాట్లాడితే ఆ పదవికి ఉన్న గౌరవం తగ్గుతుందని హితవు పలికారు. మాజీ సీఎంపై రేవంత్ రెడ్డి వాడిన భాషమీదే తెలంగాణలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. నీటి వాటాల అంశంలో తప్పు చేసిందే కేసీఆర్ అని అన్నారు.
అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని.. నీటి పంపకాల అంశంలో అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలను ఓ ఐఏఎస్ అధికారి ట్వీట్ చేశారని గుర్తుచేశారు. కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే ఇందంతా జరిగిందని విమర్శించారు. అనేకసార్లు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ తప్పించుకున్నారన్నారు. కేసీఆర్‌ను రేవంత్ తిట్టడం వెనక సింపతీ పెంచే కుట్ర దాగుందని.. కానీ ఇందుకోసం మరీ ఇంత జుగుప్సాకరమైన భాష అవసరం లేదన్నారు. తెలంగాణాకు పట్టిన పెద్ద శని కేసీఆర్ కుటుంబమని బండి ధ్వజమెత్తారు. కేసీఆర్ శని కాబట్టే ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారని కామెంట్స్ చేశారు.
వారిద్దరూ జైలుకెళ్లడం ఖాయం...
రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు బండి సంజయ్. వారిపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఉందన్నారు. ఎప్పటికైనా ఆ ఇద్దరు రాష్ట్రమంత్రులు జైలుకెళ్లడం ఖాయమని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం వద్ద అధారాలు ఉన్నాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది మంత్రులు వేల కోట్ల భూములను అమ్ముకుంటున్నారని.. దీన్ని ఎప్పటికైనా బయటపెడతామని హెచ్చరించారు. ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు జైలుకెళ్లడం ఖాయమని ఆయన చెప్పారు. కాళేశ్వరం స్కామ్ నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ కృష్ణా జలాల అంశాన్ని కొత్తగా తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం లాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. అప్పుడు పథకాల అమలుపై ప్రజలు నిలదీస్తారని కేసీఆర్ కొత్త అంశాలను తెరపైకి తెచ్చేవారని.. ఇప్పుడు రేవంత్ సైతం అదే డ్రామా ఆడుతున్నారని కేంద్రమంత్రి విమర్శించారు.
ఇవి కూడా చదవండి...
పిచ్చికుక్క దాడి.. 20 మంది భక్తులకు గాయాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
Read Latest Telangana News And Telugu News