MLC Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. జాగృతి కార్యకర్తకి గాయాలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:19 PM
మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్‌పై దాడి చేశారు.
హైదరాబాద్: మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి సంబంధించిన (MLC Teenmar Mallanna) క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. దాడి సమయంలో కార్యాలయంలోనే తీన్మార్ మల్లన్న ఉన్నాడు. కవిత బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. జాగృతి సభ్యులు బయటకి వెళ్లకపోతే కాల్పులు జరుపుతామని మల్లన్న గన్‌మెన్ హెచ్చరించాడు. గన్‌మెన్ హెచ్చరించినా కార్యాలయం నుంచి జాగృతి సభ్యులు వెళ్లకపోవడంతో గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో జాగృతి సభ్యుడు సాయి అనే యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన చేతి నుంచి బులెట్ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. అయితే తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఎక్కువగా రక్తం మరకలు కనిపించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి జరగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. జాగృతి కార్యకర్తలు కఠిన చర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలియడంతో తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ న్యూస్‌కి, తనకి భద్రత కల్పించాలని పోలీసులను తీన్మార్ మల్లన్న కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News