Share News

CM Revanth Reddy: రాజకీయ న్యాయానికి భరోసా!

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:32 AM

ప్రజాస్వామ్య ప్రక్రియలో దేశంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పిలుపునిచ్చారు.

CM Revanth Reddy: రాజకీయ న్యాయానికి భరోసా!

అట్టడుగున ఉన్న వ్యక్తికీ న్యాయం జరగాలి.. రాజ్యాంగ సవరణలకు అంబేడ్కర్‌ మద్దతుంది

  • సవరణలతోనే సామాజిక, ఆర్థిక న్యాయం సాధ్యం

  • అంబేడ్కర్‌ మాటల్లోంచే ఆర్టికల్‌ 32కు ఊపిరి

  • ఇప్పుడు రాజ్యాంగానికి రక్షణ కవచం అదే

  • రాజ్యాంగ రచనే ఒక రక్తపాత రహిత విప్లవం

  • భావితరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు

  • భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌

  • రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌ పాత్రపై ప్రసంగం

  • నిజాం రాజ్య చీఫ్‌ జస్టిస్‌ పదవిని అంబేడ్కర్‌ కాదనుకున్నారు: సుప్రీం జడ్జి జస్టిస్‌ శ్రీనరసింహ

హైదరాబాద్‌ సిటీ, జూలై 12(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య ప్రక్రియలో దేశంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పిలుపునిచ్చారు. దీన్నే ఆయన రాజకీయ న్యాయం(పొలిటికల్‌ జస్టి్‌స)గా అభివర్ణించారు. ఆర్ధిక, సామాజిక న్యాయాలతో పాటుగా ‘రాజకీయ న్యాయం’ జరిగేట్లు చూడాలన్న లక్ష్యానికి అందరూ కట్టుబడి ఉండేందుకు ప్రయత్నించాలని కోరారు. భవిష్యత్తు అవసరాల రీత్యా రాజ్యాంగాన్ని సవరించడాన్ని అంబేడ్కర్‌ స్వాగతించారని, మనం కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘‘భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్‌ పాత్ర’’ అంశంపై జరిగిన సదస్సులో ప్రధాన న్యాయమూర్తి పాల్గొని, ప్రసంగించారు. ఈ అంశం తన మనసుకు నచ్చినదని, దీనిపై ఇప్పటికే దేశదేశాల్లో మాట్లాడానని చెప్పారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్‌ పాత్ర వెలకట్టలేనిదని, ప్రపంచవ్యాప్తంగా ఆయన గొప్పదనాన్ని గుర్తించారని అన్నారు. అంబేడ్కర్‌కు 1953లో డీలిట్‌ ఇచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగ రచన సమయంలో అంబేడ్కర్‌ ఆలోచనా సరళిని విశ్లేషిస్తూ, అతి సమైక్య, అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేడ్కర్‌ వ్యతిరేకించారని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. మొదటి రాజ్యాంగ సభ సమావేశంలో రాజ్యాంగ లక్ష్యాలు, తీర్మానాలు ఎలా ఉండాలనే అంశమై అంబేడ్కర్‌ మాట్లాడినపుడు అందరూ ముగ్ధులయ్యారని తెలిపారు. అందరూ హక్కుల గురించే మాట్లాడుతున్నారని, వాటిని చేర్చాక ఎలా కాపాడుకోవాలో ఎవరూ మాట్లాడరేంటని ప్రశ్నించారని తెలిపారు. ఆయన మాటల్లోంచే రైట్‌ టు కాన్‌స్టిట్యూషనల్‌ రెమెడీ్‌స(ఆర్టికల్‌ 32) వచ్చిందని చెప్పారు. ఈ ఆర్డికల్‌ రాజ్యాంగానికి ఆత్మలా, రక్షణ కవచంలా పని చేస్తోందని అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటు కలిగిందని చెప్పారు. రాజ్యాంగ రచన ఒక రక్తపాత రహిత విప్లవమని కొనియాడారు.


భవిష్యత్తు తరాల్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ రచన

కాలానుగుణంగా సవాళ్లను అధిగమించడానికి రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా ఆర్థిక, సామాజిక న్యాయాన్ని సాధించవచ్చని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. రాజకీయ మార్గంలో సోషలిస్ట్‌ సిద్ధాంతంతో రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పటికీ నాటి తీర్మానాలలో సామాజిక, ఆర్థిక సమానత్వానికి సంబంధించిన అంశాలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగ సభకు అంబేడ్కర్‌ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం దేశ విభజన తర్వాత తూర్పు పాకిస్థాన్‌లో ఉందని తెలిపారు. ఆయన రాజ్యాంగ సభలో అడుగు పెట్టే నాటికి రాజ్యాంగ రచన కమిటీలో సభ్యునిగా ఉంటాననే సంగతి కూడా తెలియదన్నారు. రెండు సంవత్సరాల కష్టం తర్వాత రచనా సంఘం సవివరంగా రాజ్యాంగ ప్రతిని సభకు సమర్పించిందని చెప్పారు. ఆనాడుఅంబేడ్కర్‌ తన ప్రసంగంలో రాజ్యాంగం అంటే ఏమిటి? దేనికి ప్రతిరూపంగా నిలుస్తుంది? వంటి ప్రశ్నలకు వివరణలు ఇచ్చారని జస్టిస్‌ గవాయ్‌ గుర్తు చేసుకున్నారు. ‘‘అమెరికాలో లాగా సమాఖ్య వ్యవస్థ ఉంటుంది కానీ, అక్కడిలాగా ద్వంద్వ పౌరసత్వం ఉండదు. అక్కడలా కేంద్రానికి, రాష్ట్రానికి వేర్వేరు రాజ్యాంగాలు ఉండవు. మనది ఒకటే మిషన్‌... ఒకటే రాజ్యాంగం. దేశం ఐక్యంగా ఉండటానికి అది అవసరమని అంబేద్కర్‌ గట్టిగా నమ్మారు. వాదించారు. భారత రాజ్యాంగాన్ని ఒకవైపు నుంచి చూస్తే మరీ కఠినంగా ఉందని, మరోవైపు నుంచి చూస్తే మరీ ఉదారంగా ఉందని విమర్శలు వచ్చాయి. వాటికి అంబేద్కర్‌ సమాధానమిస్తూ, తాము రాజ్యాంగాన్ని భావి తరాలను దృష్టిలో ఉంచుకొని రచించామని చెప్పారు’’ అని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. మన రాజ్యాంగం మరీ సమాఖ్య రూపంలో ఉందని కొందరు, కేంద్రీకృతంగా ఉందని కొందరు విమర్శించగా, శాంతి, యుద్ధ సమయాల్లో దేశాన్ని ఏకతాటిపై నడిపించడానికి వీలుగా అలా రూపొందించామని అంబేడ్కర్‌ చెప్పారన్నారు. 75 సంవత్సరాల పయనంలో భారత్‌ బయట నుంచి, దేశీయంగా అనేక సవాళ్లను ఎదుర్కొందని, భారతీయులంతా ఏకతాటిపై ఉన్నారని చాటి చెప్పిందని జస్టిస్‌ గవాయ్‌ గుర్తు చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంతో రాజ్యాంగం పాత్ర వెలకట్టలేనిదన్నారు.


నిజాం ఆఫర్‌ను అంబేడ్కర్‌ తిరస్కరించారు

హైదరాబాద్‌ రాజ్య ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టాని అప్పటి నిజాం అంబేడ్కర్‌ను ఆహ్వానించారని, ఆ ఆఫర్‌ను అంబేడ్కర్‌ సున్నితంగా తిరస్కరించారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహా వెల్లడించారు. అంబేడ్కర్‌కు హైదరాబాద్‌కు ఉన్న అనుబంధాన్ని, అంబేడ్కర్‌ ఆత్మకథలోని విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌లో జరిగిన సామాజిక ఉద్యమాలకు అంబేడ్కర్‌ మద్దతు ప్రకటించారని తెలిపారు. అంబేడ్కర్‌ ఆత్మకథలో హైదరాబాద్‌ ఉద్యమాలు, సామాజిక న్యాయం ప్రస్తావనలు ఉన్నాయని గుర్తు చేశారు. అంబేడ్కర్‌ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చాయనడానికి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ గవాయ్‌ నియామకమే నిదర్శనమని చెప్పారు. తన సొంత నగరానికి, తాను చదువుకున్న విశ్వవిద్యాలయానికి భారత ప్రధాన న్యాయమూర్తితో కలిసి రావడం ఆనందంగా ఉందని అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తితో అంబేద్కర్‌ మీద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం చొరవ చూపడాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ప్రశంసించారు. అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి కూడా విశ్వవిద్యాలయం చొరవను కొనియాడారు. రాష్ట్ర పోస్టల్‌ శాఖ రూపొందించిన అంబేడ్కర్‌ స్మారక పోస్టల్‌ కవర్‌ను, పోస్టు కార్డును జస్టిస్‌ గవాయ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ఎం.కుమార్‌ మొలుగరం, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, రాష్ట్ర చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.విద్యాసాగర్‌రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 05:33 AM