Share News

Hyderabad: ఆన్‌‘లైన్‌’ తప్పుతున్నారు.. సోషల్‌ మీడియా స్నేహాలతో అడ్డదారులు

ABN , Publish Date - Oct 07 , 2025 | 07:43 AM

ఆన్‌లైన్‌/సోషల్‌ మీడియా పరిచయాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నగర శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసిన పోలీసులు సుమారు 50 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad: ఆన్‌‘లైన్‌’ తప్పుతున్నారు.. సోషల్‌ మీడియా స్నేహాలతో అడ్డదారులు

- గాడితప్పుతున్న బాల్యం..

- పాశ్చాత్య కల్చర్‌ వైపు పయనం

- నేరాల బాట పడుతున్న కొందరు మైనర్లు

- తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌/సోషల్‌ మీడియా పరిచయాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నగర శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌(Farmhouse)పై దాడి చేసిన పోలీసులు సుమారు 50 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. సోషల్‌మీడియాలో పరిచయం పెంచుకొని ఒక్కచోట చేరిన వారంతా పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో పలువురు మైనర్లు మద్యంతో పాటు, గంజాయిని తీసుకున్నట్లు తేలింది.


అందరూ 15 నుంచి 17 ఏళ్లలోపు వారే. జల్సాలు, వ్యసనాలకు బానిసలవుతున్న యువత కొత్తరకం పాశ్చాత్య కల్చర్‌కు అలవాటుపడుతున్నారు. చిన్న వయసులోనే పార్టీలు చేసుకోవడం, మద్యంతో పాటు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వినియోగించడం తల్లిదండ్రులను, పోలీసులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇద్దరు మైనర్లకు గంజాయి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఇలాంటి పార్టీల ద్వారా ఎంతమంది మాదకద్రవ్యాలను అలవాటు చేసుకుంటారో అని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.


city3.2.jpg

చెడు వ్యసనాల బాట

మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలు యువతను నిర్వీర్యం చేస్తున్నాయని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కొంతమంది పిల్లలు 15 ఏళ్ల వయసులోనే చెడు స్నేహాలు చేస్తూ మద్యం, సిగరెట్‌, గంజాయి వంటి అలవాట్లకు బానిసలవుతున్నారు. యుక్త వయసుకు వచ్చిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నారు. అందులో వారు ఏం చేస్తున్నారు? సోషల్‌మీడియాలో ఎలాంటి యాక్టివిటీస్ కు పాల్పడుతున్నారు? ఎలాంటి గేమ్స్‌ చూస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు.. వంటి అంశాలపై పర్యవేక్షణ అవసరం అని సూచిస్తున్నారు. స్కూలు/కళాశాలలో టీచర్స్‌ కూడా పిల్లల ప్రవర్తనను గమనించాలి. చెడు వ్యసనాలకు బానిసలైన తర్వాత వాటి కోసం దొంగతనాలు, దోపిడీలు, చివరకు తీవ్రమైన నేరాలకు మైనర్లు వెనుకంజ వేయడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.


బాలికను చంపిన బాలుడు

ఇటీవల 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఆ కేసు మిస్టరీని ఛేదించడానికి అహర్నిశలు కష్టపడిన పోలీసులు చివరకు 14 ఏళ్ల బాలుడే పక్కింటి బాలికను హత్య చేసినట్లు తేల్చారు. బ్యాట్‌ దొంగతనానికి వెళ్లిన బాలుడిని ఆ బాలిక అడ్డుకోవడంతో ఉద్రేకానికి లోనై కత్తితో ఆమెను విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. దాంతో బడిలో గడపాల్సిన అతడి బాల్యం జువైనల్‌ హోమ్‌కు చేరింది. ఆ బాలుడికి ఓటీటీలో హర్రర్‌ సినిమాలు, సోషల్‌మీడియాలో ఎక్కువ సమయం గడిపే అలవాటు ఉందని పోలీసులు గుర్తించారు.


ఇన్‌స్టా పరిచయం.. తల్లి హత్య

ఎక్కువ సమయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపే ఓ బాలికకు 19 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసి బాలిక తల్లి ఆమెను మందలించింది. దాంతో బాలిక ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. పోలీసులు వారిని పట్టుకుని మందలించి వదిలేశారు. తన ప్రేమ విషయం తల్లికి నచ్చలేదని భావించిన బాలిక ఆ యువకుడితో కలిసి ఏకంగా ఆమెను హత్య చేయించింది. ఈ ఘటనలో వారితో పాటు మరో బాలుడి జీవితం కటకటాల పాలైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ రాజకీయం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 07:43 AM