Share News

Harish Rao: కాళేశ్వరం నివేదిక.. కాంగ్రెస్‌ సర్కారు కుట్ర!

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:37 AM

కాంగ్రెస్‌ సర్కార్‌ కుట్రలో భాగంగానే కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ముందుకు తెచ్చిందని.. ఏదో ఒకరకంగా కేసీఆర్‌ను బద్నాం చేయడమే వారి లక్ష్యంగా కనబడుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: కాళేశ్వరం  నివేదిక..  కాంగ్రెస్‌ సర్కారు కుట్ర!

రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిన కమిషన్ల నివేదికలు న్యాయస్థానాల్లో నిలబడవు

  • కేసీఆర్‌ను హింసించాలన్నదే ఉద్దేశం

  • కమిషన్‌ ఒకవైపే విచారించి నివేదిక ఇచ్చినట్టు ఉంది

  • కాళేశ్వరానికి అనుమతుల్లేవంటే.. కేంద్రాన్ని తప్పుబట్టినట్టే: హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సర్కార్‌ కుట్రలో భాగంగానే కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ముందుకు తెచ్చిందని.. ఏదో ఒకరకంగా కేసీఆర్‌ను బద్నాం చేయడమే వారి లక్ష్యంగా కనబడుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలేవీ న్యాయస్థానాల్లో నిలబడలేదన్నారు. గతంలో ఇందిరాగాంధీ, చంద్రబాబులపై ఇచ్చిన కమిషన్‌ నివేదికలు కూడా నిలబడలేదని గుర్తు చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ కుట్రలు.. కమిషన్‌ వక్రీకరణలు, వాస్తవాలు’ అనే అంశంపై మంగళవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘‘కేసీఆర్‌ను హింసించాలన్నదే రేవంత్‌రెడ్డి ఉద్దేశం. అందుకే టీవీ సీరియళ్ల మాదిరిగా కాళేశ్వరం, విద్యుత్‌ అంటూ వరుస కమిషన్లను ముందుకుతెచ్చి ఏదోచేయాలని చూస్తున్నారు. కుట్రపూరితంగానే కమిషన్‌ విచారణ జరిగినట్టు కనబడుతోంది. 665 పేజీల నివేదికలో కొన్ని అంశాలంటూ బయటపెట్టారు. అవి నిజంగా ఆ నివేదికలో ఉన్నాయా, లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఒకవేళ వారు చెప్పిందే నిజమైతే.. కమిషన్‌ కాంగ్రెస్‌ సర్కారుకు అనుకూలంగా ఒకవైపే చూసి, విని, వారివైపే నిలబడి నివేదిక ఇచ్చిందన్న అనుమానం కలుగుతోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తప్పుడు ప్రచారానికి తెరతీశారు. దురుద్దేశంతో కేవలం 60 పేజీలను బయటపెట్టారు. మొత్తం 665 పేజీల్లో అంశాలను అసెంబ్లీలో పెట్టాలి. గట్టిగా సమాధానం చెబుతాం’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.


అనుమతుల్లేవంటే కేంద్రాన్ని తప్పుబట్టినట్లే..

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేవనడం చూస్తే కేంద్ర ప్రభుత్వాన్నే తప్పుబట్టినట్లుగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రహస్యాలేమీ లేవని, అన్ని అంశాలు డీపీఆర్‌లో ఉన్నాయని చెప్పారు. పదకొండు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయని.. కమిషన్‌ ఆ ఏజెన్సీలను తప్పుబడుతోందా, ఎవరిని తప్పుబడుతుందని ప్రశ్నించారు. ‘‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్‌ ఉందంటూ నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారని కమిషన్‌ నివేదికలో ప్రస్తావించారు. కానీ అదే లేఖలోని మూడో పేజీలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చని కేంద్ర మంత్రి స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని కమిషన్‌ గుర్తించలేదా? ప్రభుత్వం కావాలనే దాచిపెట్టిందా?’’ అని హరీశ్‌రావు నిలదీశారు.

నీటి లభ్యత లేదనే.. మేడిగడ్డకు మార్చాం

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌ (గరిష్ట నీటి మట్టం)కన్నా తక్కువ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే నిరుపయోగం అవుతుందని సీడబ్ల్యూసీ పలు సందర్భాల్లో హెచ్చరించిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. ‘‘152 మీటర్ల ఎత్తుకు ఒప్పుకోబోమని, 148 మీటర్ల ఎత్తు అయితే అంగీకరిస్తామని అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దానికితోడు ప్రతిపాదత ప్రాంతం అభయారణ్యంలో ఉండటంతో అనుమతులు క్లిష్టతరం. కాలయాపన తప్ప మరోటి లేదు. దీనికి అనుగుణంగానే సీడబ్ల్యూసీకి సమర్పించిన కాళేశ్వరం డీపీఆర్‌లో తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని స్పష్టంగా తెలిపాం. దానిని సీడబ్ల్యూసీ ఆమోదించింది. 160 టీఎంసీల నీటిలభ్యత లేదనే విషయం తప్పే అయితే ఆ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించి, అనుమతులు ఇవ్వదు కదా’’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం డీపీఆర్‌ ఇప్పటికీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉందని, పరిశీలించాలని సూచించారు.


రిటైర్డ్‌ ఇంజనీర్లు వ్యతిరేకించలేదు

మేడిగడ్డను రిటైర్డ్‌ ఇంజనీర్లు వ్యతిరేకించారని చెప్పడం వాస్తవం కాదని, ఐదుగురు నిపుణులతో వేసిన కమిటీ మేడిగడ్డను సూచించిందని హరీశ్‌రావు చెప్పారు. ‘‘మేడిగడ్డ- మిడ్‌మానేరు మార్గాన్ని మార్చి.. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి బ్యారేజీకి గోదావరి మార్గంలో నీటిని తరలించాలని ఇంజనీర్లు సూచించారు. ఈ క్రమంలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఏర్పాటుచేసి ఎల్లంపల్లికి అక్కడి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందని నిపుణుల కమిటీ కమిషన్‌కు కూడా చెప్పింది’’ అని వివరించారు.


కేసీఆర్‌ సొంత నిర్ణయమేమీ కాదు..

కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్‌ ఒక్కరి నిర్ణయమనే ఆరోపణ సరికాదని, ఆ ప్రాజెక్టుకు క్యాబినెట్‌, శాసనసభ ఆమోదం ఉన్నాయని హరీశ్‌రావు చెప్పారు. 2016 మార్చి 10న గవర్నర్‌ ప్రసంగంలో, 2016 ఏప్రిల్‌ 16న నాటి ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌ గురించి స్పష్టంగా ఉందని.. వాటికి క్యాబినెట్‌, శాసనసభ ఆమోదం తెలిపాయని గుర్తుచేశారు. 2018 మే 27న, 2021 ఆగస్టు 1న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని కేబినెట్‌ ఆమోదించిందని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకూ ఆమోదం ఉందని చెప్పారు. అప్పటి క్యాబినెట్‌లోని ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, వారిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. అప్పటి క్యాబినెట్‌లో చర్చించిన అంశాలతో 30 పేజీల కాపీ ఉంటుందని, ఆ సమాచారం ఇవ్వాలని సీఎ్‌సను కోరినా స్పందన రాలేదని హరీశ్‌రావు చెప్పారు. 2016 మార్చి 31న నాటి సీఎం కేసీఆర్‌ శాసనసభలో రీఇంజనీరింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల్లో కలిపి 225 పిల్లర్లు ఉన్నాయని, అందులో మేడిగడ్డలో కేవలం రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే కుప్పకూలిందంటూ కాంగ్రెస్‌ అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.


కేసీఆర్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు

కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపుహౌ్‌సలు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల నిల్వ సామర్థం, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు, 240 టీఎంసీల నీటి వినియోగమన్న విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు తెలుసుకోవాలన్నారు. వందేళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ కాళేశ్వరం నిర్మించారని, గోదావరి నదిపై బ్యారేజీ కట్టిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌లా కేసీఆర్‌ ఇక్కడి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతారని పేర్కొన్నారు.


కొడంగల్‌ ఎత్తిపోతలకు అనుమతి ఉందా?

సీఎం రేవంత్‌ నియోజకవర్గంలోని కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి ఏ అనుమతి ఉందని రేవంత్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టారో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. నారాయణపేట్‌-కొడంగల్‌ లిఫ్ట్‌ ప్రాజెక్టుకు ఒక్క అనుమతి అయినా ఉందా చూపించాలని మంత్రి ఉత్తమ్‌ను ప్రశ్నించారు. డీపీఆర్‌ లేకుండానే పనులు ప్రారంభించారని, ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్లులు కూడా చెల్లించిన రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌లపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 04:37 AM