Share News

Hyderabad: మహీంద్ర వర్సిటీలో డ్రగ్స్‌ కలకలం!

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:09 AM

హైదరాబాద్‌లోని మహీంద్ర విశ్వవిద్యాలయంలో మత్తుమందుల రాకెట్‌ను సైబరాబాద్‌ ఈగల్‌ పోలీసు బృందాలు బట్టబయలు చేశాయి.

Hyderabad: మహీంద్ర వర్సిటీలో డ్రగ్స్‌ కలకలం!

  • మత్తు మందుకు అలవాటుపడ్డ 50 మంది విద్యార్థులు.. ముగ్గురి అరెస్టు

  • ఈగల్‌ బృందాల విస్తృత తనిఖీలు

  • గంజాయి, ఓజీ కుష్‌ స్వాధీనం

  • నైజీరియన్‌ నుంచి మత్తుమందులు

  • ఢిల్లీ, బీదర్‌ నుంచి గంజాయి సరఫరా

  • తొలుత మత్తుమందుకు బానిసలై.. తర్వాత డ్రగ్‌ పెడ్లర్లుగా విద్యార్థులు

  • ‘మల్నాడు’ లింకులతో బయటపడ్డ దందా

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మహీంద్ర విశ్వవిద్యాలయంలో మత్తుమందుల రాకెట్‌ను సైబరాబాద్‌ ఈగల్‌ పోలీసు బృందాలు బట్టబయలు చేశాయి. 50 మంది విద్యార్థులు డ్రగ్స్‌ సేవిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. మత్తు మందుల రవాణా, విక్రయాలతో సంబంధం ఉన్న ముగ్గురు విద్యార్థులతో పాటు మరొక బయటి వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్‌ స్వాఽధీనం చేసుకున్నారు. ఈగల్‌ డైరక్టర్‌ సందీప్‌ శాండిల్య కఽథనం మేరకు... గతంలో జరిగిన మల్నాడు కిచెన్‌ డ్రగ్స్‌ దందా కేసులో మత్తుమందులు కొరియర్‌ పార్శిళ్ల ద్వారా వస్తున్నట్లు వెల్లడైంది. ఢిల్లీలోని రాజేశ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ (శ్రీ మారుతి కొరియర్స్‌ ఫ్రాంచైజీ) ద్వారా మత్తుమందులు హైదరాబాద్‌కు రవాణా అయినట్లు అప్పట్లో ఈగల్‌ టీం గుర్తించింది. దీంతో హైదరాబాద్‌లోని కొరియర్‌ డెలివరీ బాయ్స్‌ను ఈగల్‌ బృందాలు పలుమార్లు కలిసి కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. తమకు ఏ విధంగా సమాచారం అందించాలనే విషయాలను తెలియచేశారు. ఈ క్రమంలో వారిచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ రాకెట్‌ ఛేదించారు. న్యూఢిల్లీలోని రాజేశ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ నుంచి మహీంద్ర విశ్వ విద్యాలయంలోని హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థి దినేశ్‌కు రెండు పార్శిళ్లు వచ్చినట్లు ఈగల్‌ బృందాలు గుర్తించాయి. అలాగే ఇదే వర్శిటీ విద్యార్థి భాస్కర్‌.. నైజీరియన్‌ నిక్‌కు రెండుసార్లు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపినట్లు తెలుసుకున్నాయి. ఇక్కడ భాస్కర్‌ మత్తుమందుల కోసం పేమెంట్‌ చేస్తే పార్శిల్‌ డెలివరీ తీసుకుంది మాత్రం దినేశ్‌ కావడం గమనార్హం. నిక్‌ ద్వారా వీరికి అందిన డ్రగ్స్‌ను క్వాక్‌ ఏరినా పబ్‌కు తీసువెళ్లి అక్కడ భాస్కర్‌, దినేశ్‌ మరో ముగ్గురు స్నేహితులు కలిసి సేవించేవారు. అలాగే, మణిపూర్‌కు చెందిన విద్యార్థి నెవెల్లే తాంగ్ర్బోమ్‌ ఢిల్లీ నుంచి నిక్‌ నెట్‌వర్క్‌ కాకుండా మరో నెట్‌వర్క్‌ ద్వారా మత్తుమందులు తెప్పించి భాస్కర్‌కు అందజేసేవాడు. భాస్కర్‌ ఆ మత్తుమందును నాలుగు గ్రాముల ప్యాకెట్లుగా మార్చి ఇతర విద్యార్థులకు అత్యధిక ధరలకు అమ్మేవాడు. వీరే కాకుండా మరో విద్యార్థి మహ్మద్‌ అశ్వర్‌ జావేద్‌ ఖాన్‌ సైతం గురుగామ్‌, ఢిల్లీ నుంచి గంజాయి తెప్పించి విద్యార్థులకు విక్రయించేవాడు. వీరికి ఢిల్లీ నుంచి మత్తుమందులు రావడం ఆలస్యమైతే మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న శివకుమార్‌ బీదర్‌ నుంచి గంజాయి తెచ్చి ఇచ్చేవాడు.


తీగలాగి.. డొంక కదిపి..

గతంలో మల్నాడు కిచెన్‌ కేసులో సూర్య ద్వారా నిక్‌కు డబ్బు ఆన్‌లైన్‌లో అందినట్లు గుర్తించిన పోలీసులు అప్పటి నుంచి నిక్‌ బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టడంతో ఈ విద్యార్థుల విషయం బయటపడింది. దీంతో వారం రోజుల పాటు ఈగల్‌ బృందాలు వర్శిటీలో రహస్యంగా పలు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించాయి. మత్తుమందులు అమ్ముతున్న ఇద్దరు విద్యార్థుల ఫోన్‌ నంబర్లు, వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఈగల్‌ బృందాలు తెలుసుకున్నాయి. వారిద్దరూ వర్శిటీ హాస్టల్‌ నుంచి బయటకు వచ్చి సూరారంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ విద్యార్థుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించినపుడు 50 మంది ఇతర విద్యార్థులు తరచుగా డబ్బు చెల్లించి వీరి వద్ద నుంచి మత్తుమందులు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.


మరికొంత మందిని అరెస్టు చేస్తాం: సందీప్‌ శాండిల్య

అరెస్టయిన నలుగురిలో ముగ్గురు విద్యార్థులు కాగా, ఒకరు బయటి వ్యక్తి అని మొత్తం రెండు గ్రూపులుగా వీరంతా ఇతర విద్యార్థులకు మత్తుమందులు అమ్ముతున్నట్లు తమవిచారణలో వెల్లడైందని సందీప్‌ శాండిల్య వివరించారు. నెవెల్లే డ్రగ్స్‌కు అలవాటు పడిన విద్యార్థుల ఫోన్‌ నంబర్లును గణేశ్‌, అశ్వర్‌లకు ఇస్తుండేవాడని, ఢిల్లీలో 28 గ్రాముల ఓజీ కుష్‌ను రూ.30 వేలకు కొని, ఇక్కడ ఒకో గ్రామును విద్యార్థులకు రూ.2,500 లకు అమ్మారని ఆయన తెలిపారు. భాస్కర్‌, దినేశ్‌లు నైజీరియన్‌ నుంచి ఎండీఎంఏ మత్తుమందులు తెప్పిస్తుండగా.. నెవెల్లే, గణేశ్‌, అశ్వర్‌, శివకుమార్‌లు గంజాయి, ఓజీ కుష్‌ దందాలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో మరికొంత మందిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకు సింబోసిస్‌ కాలేజీ, ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌, గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, కలినరి అకాడమీ, సీబీఐటీ, ఐఐటీ బాసర, జేఎన్‌టీయూ జోగిపేట,మెడిసిటీ మెడికల్‌ కాలేజీ, ఉస్మానియా, ఇక్ఫాయ్‌ విశ్వ విద్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 27 , 2025 | 05:09 AM