ఐదు ఎమ్మెల్సీ సీట్లకు ఐదుగురు
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:12 AM
ఎమ్మెల్యే కోటా పరిధిలోని ఐదు ఎమ్మెల్సీ సీట్లకు కాంగ్రెస్ తరఫున ముగ్గురు, సీపీఐ, బీఆర్‌ఎస్ తరపున ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఐదు సీట్లకుగాను నాలుగింటిలో పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్.. అందులో ఒకటి మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన సంగతి తెలిసిందే.

ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థుల నామినేషన్ల
దాఖలుకు హాజరైన సీఎం, మంత్రులు
కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా పరిధిలోని ఐదు ఎమ్మెల్సీ సీట్లకు కాంగ్రెస్ తరఫున ముగ్గురు, సీపీఐ, బీఆర్‌ఎస్ తరపున ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఐదు సీట్లకుగాను నాలుగింటిలో పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్.. అందులో ఒకటి మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ తరఫున అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్, విజయశాంతి, సీపీఐ తరపున నెల్లికంటి సత్యం అసెంబ్లీలో ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి సోమవారం తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీప్ మహేశ్‌గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, సీపీఐ నేత కె.నారాయణ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మజ్లిస్ ఎమ్మెల్యేలు జాఫర్ హుసేన్, ఖాజా మొయినుద్దీన్ సైతం పాల్గొనడం ద్వారా.. అధికార కాంగ్రె్‌సకే తమ మద్దతు ఉంటుందని స్పష్టత ఇచ్చినట్లయింది. తొలుత కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులతోపాటు సీఎల్పీ కార్యాలయానికి చేరుకున్న సీఎం రేవంత్.. అక్కడి నుంచి అసెంబ్లీలోకి వెళ్లి అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. నిర్ణీత సమయానికి సీఎల్పీ కార్యాలయానికి రాలేకపోయిన విజయశాంతి.. నేరుగా ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. అలాగే, బీఆర్‌ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో నామినేషన్ సమర్పించారు. కాగా, నిబంధనల ప్రకారం పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో మూడు పార్టీలకు చెందిన ఐదుగురు మాత్రమే నామినేషన్లు వేయడంతో.. వారి ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే. అయితే, ఈ ఐదుగురే కాకుండా మరో ఆరుగురు ఇండిపెండెంట్లూ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ప్రతిపాదిత ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా దాఖలైన ఆ నామినేషన్లు మంగళవారం నాటి పరిశీలనలో తిరస్కరణకు గురికానున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13న సాయంత్రం 3 గంటల వరకూ గడువు ఉంది. ఆ వెంటనే ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.
రేవంత్‌ను కలిసిన అద్దంకి, విజయశాంతి
కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న అద్దంకి దయాకర్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్‌కు ఆయన కృతజ్ఙతలు తెలిపారు. అలాగే, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సైతం సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఇంకో ఎమ్మెల్సీ సీటూ వస్తుంది: కూనంనేని
ఎన్నికల ముందు కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు భవిష్యత్తులో మరో ఎమ్మెల్సీ సీటు తమకు రానుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడుతూ పొత్తులో భాగంగా తమకు ఒక అసెంబ్లీ సీటు ఇచ్చి, అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారని తెలిపారు. కానీ.. మంత్రి పదవికి బదులు రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని తాము కోరినట్లు చెప్పారు. తద్వారా చట్టసభల్లో తమ పార్టీ ప్రాతినిధ్యం ఏడెనిమిదేళ్ల పాటు కొనసాగుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News