Share News

CM Revanth Reddy: నన్ను కోసినా..

ABN , Publish Date - May 06 , 2025 | 03:57 AM

ఉద్యోగ సంఘాలు సమరం చేస్తామని ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపై, ఎందుకు సమరం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే బాధ్యత ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారు.

CM Revanth Reddy: నన్ను కోసినా..

  • ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను

  • రూ.18,500 కోట్లలోనే జీతాలూ, బాకీలు, సంక్షేమమూ!

  • మీ సమరం 98 శాతం ఉన్న ప్రజల మీదా?

  • మీ జీతాలు, పెన్షన్లు ఇచ్చే వారి పట్ల బాధ్యత లేదా?

  • కొత్త కోరికలతో దీక్షలకు దిగితే వ్యవస్థ కూలుతుంది

  • కరెంటు, పెన్షన్లు.. ఏ పథకాలు ఆపాలో చెప్పండి

  • పెట్రోల్‌, ఉప్పులు, పప్పులు ధరలు పెంచుదామా?

  • రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు

  • ప్రజలపై యుద్ధం చేసిబాగుపడ్డ వారు లేరు

  • ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినోడు ఫాంహౌ్‌సలో..

  • నేను వచ్చాక ఎకరం భూమిని అమ్మలేదు

  • విమానాల్లో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నా

  • అప్పు కోసం వెళ్తే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నాయి

  • ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాలు సమరం చేస్తామని ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపై, ఎందుకు సమరం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే బాధ్యత ఉద్యోగులకు లేదా? అని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి కుదురుకుంటున్న తరుణంలో కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. తనను నిలువునా కోసినా వస్తున్న ఆదాయానికి మించి తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం అంటే తాము మాత్రమే కాదని, ఉద్యోగులు కూడా అందులో భాగమేనని చెప్పారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్‌ సిబ్బందికి అవార్డులు అందించే కార్యక్రమం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కలిస్తే కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి బాధ్యత ఈ రెండు శాతం మంది మీద ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రకటించిన సమరం 98ు ఉన్న రాష్ట్ర ప్రజలపైనా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పదేళ్లల్లో ప్రభుత్వ ఉద్యోగి ఏనాడే 1న వేతనం తీసుకోలేదని రేవంత్‌ ప్రస్తావించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1.58 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకు రూ. 1.52 లక్షల కోట్లు కట్టామని వివరించారు. తెచ్చిన అప్పులోంచి ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికి గానీ, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు గానీ వాడలేదని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు సంబంధించి నెలకు రూ. 7 వేల కోట్లు అసలు, మిత్తి చెల్లిస్తున్నామని వివరించారు. ఉద్యోగుల పదవీ కాలం 58 ఏళ్లనుంచి మూడేళ్లు పెంచిపోయారని, రిటైర్మెంట్‌ బకాయిలు రూ.8,500 కోట్లు పెడింగ్‌ పెట్టి వెళ్లారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదహారు నెలల్లో రూ.30 వేల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ బకాయిలు వేల కోట్లు బాకీ పెట్టిందని చెప్పారు. బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయిలు పెట్టిందని వివరించారు. ప్రాజెక్టులకు సంబంధించే కాంట్రాక్టర్లకు రూ.50 వేల కోట్లు బకాయిలు పెట్టారని వివరించారు. ప్రభుత్వమై ఉండి 11ు వడ్డీకి అప్పులు తెచ్చారని, ఇంత దుర్మార్గం దేశంలో ఎక్కడా ఉండదని వ్యాఖ్యానించారు. ఔటర్‌ రింగురోడ్డు, గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌లో ఉన్న భూములన్నీ అమ్మేశారని ప్రస్తావించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక గుంట భూమి అమ్మలేదని స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములుగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమరం అని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవర్ని నిందించదలుచుకున్నారు? అన్నారు. ఉద్యోగులకు 35 ఏళ్లు జీతభత్యాలు, పదవీ విరమణ తర్వాత పెన్షన్లుఇచ్చేది 98ు ప్రజలేనని, వారి విషయంలో ఉద్యోగులకు బాధ్యత లేదా? అని సీఎం ప్రశ్నించారు.


ప్రజల్ని ఇబ్బందులకు గురిచేద్దామా?

రాష్ట్ర ఆదాయం ప్రతి నెలా రూ,18,500 కోట్లు మాత్రమే వస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర కనీస అవసరాలు తీర్చేందుకు రూ.22,500 కోట్లు అవసరమని వివరించారు. వస్తున్న ఆదాయంలో 7 వేల కోట్లు అప్పులకు, 5,500 కోట్లు జీతాలకు పోతోందని చెప్పారు. మిగిలే 6 వేల కోట్లలో వృద్ధాప్య పెన్షన్‌, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, షాదీ ముబాకర్‌, కల్యాణ లక్ష్మి, విద్యార్థుల ఫీజుల చెల్లింపులు ఈ పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. దుబారా తగ్గించి సర్దుబాటు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశం ఉన్నా సామాన్యుడిలా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నానని గుర్తు చేశారు. గతంలో విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చేవని, ఇప్పుడు ఒకటో తేదీనే వస్తున్నాయని ప్రస్తావించారు. సమరం చేసేందుకు ఇక్కడ లేమని, ప్రజలపై యుద్ధం చేసిన వారు ఎవరూ బాగుపడలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయని, వాటి ఉచ్చులో పడి, వాటి చేతిలో చురకత్తిగా మారి ప్రజల్ని గాయపర్చవద్దని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తనను నిలువునా కోసినా... రూ.18,500 కోట్లకు మించి ఆదాయం లేదని చెప్పారు. నన్ను కోసుకుని తింటారా? అని ఉద్యోగ సంఘాల నాయకుల్ని ప్రశ్నించారు. ఉచిత కరెంట్‌, వృద్దాప్య పెన్షన్‌, ఏది ఆపాలో చెప్పాలని నిలదీశారు. ఉద్యోగులు డిసైడ్‌ చేస్తే బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి. ప్రజలకు వివరించి ఆ పథకాలు నిలిపేద్దామని వ్యాఖ్యానించారు. పథకాలు ఆపలేమనుకుంటే నిత్యావసరాల ధరలు అడ్డగోలుగా పెంచుదామా? రూ.100 ఉన్న లీటర్‌ పెట్రోల్‌ రూ.200 చేద్దామా? రూ.30కి ఇచ్చే బియ్యం రూ.60కి ఇద్దామా? పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు రెండింతలు చేద్దామా? అని ఉద్యోగ సంఘాల నాయకుల్ని నిలదీశారు. ధరలు పెంచకుండా, ఉన్న పథకాల్ని ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవని స్పష్టం చేశారు. కొత్త కోరికతో ఉద్యమిస్తే వ్యవస్థ కూలిపోతుందని, రాష్ట్రం దివాలా తీస్తుందని, పెట్టుబడులు ఆగిపోతాయని, ఉద్యోగాలు రావని హెచ్చరించారు. ఉద్యోగులను ఒక్క మాట అనబోనని, అంతా ప్రజలకు వివరిస్తానని చెప్పారు.


‘‘ఎక్కడా అప్పు పుట్టడం లేదు. అప్పుకోసం వెళితే దొంగోడిలా చూస్తున్నారు. నన్ను కోసినా వస్తున్న ఆదాయానికి మించి పైసా మీకివ్వలేను. మీ కోసం ధరలు పెంచమంటారా? పథకాలు ఆపమంటారా? చెప్పండి, మీరేది తేలిస్తే అదే ప్రజలకు చెబుదాం’’

‘‘స్వీయ నియంత్రణతో ఉన్నంతలో బండి నడపటమే పరిష్కారం. కాదు సమరం చేస్తానంటే రాజకీయ పార్టీల చేతిలో పావుగా మారినట్లే. ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. రాష్ట్రం దివాలా తీస్తుంది. మన 2 శాతం మంది ప్రయోజనాలా? 98 శాతం మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలా చెప్పండి’’

- సీఎం రేవంత్‌ రెడ్డి


ఫెయిల్‌ అంటే ముఖం వెలుగుతోంది

అడ్డగోలుగా 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి అందరికీ చెల్లింపులు ఆపి బకాయిలు పెట్టి ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి చక్కగా ఫామ్‌ హౌస్‌లో పడుకున్నాడని రేవంత్‌ ఎద్దేవా చేశారు. మూడు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఏదో ఒక విషయం పట్టుకుని ప్రభుత్వం ఫెయిల్‌ అని మాట్లాడి వెళ్లిపోతుంటారని వ్యాఖ్యానించారు. బాధతో చెప్పాల్సిన ఫెయిల్‌ అన్న పదాన్ని పలికినపుడల్లా ఆయన మొహం వెయ్యి ఓల్టుల బల్బులా వెలుగుతోందని అన్నారు. ఇదేం పైశాచిక ఆనందమని ప్రశ్నించారు. ఉద్యోగులు సమయస్ఫూర్తితో ఆలోచించాలని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపునకు అప్పగించొద్దని కోరారు.


అప్పు పుడతలే... దొంగల్లా చూస్తున్నారు

రాష్ట్ర అవసరాలకు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదని సీఎం చెప్పారు. అప్పుకోసం వెళ్తే బ్యాంకర్లు దొంగల్లా చూస్తున్నారని, మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని వివరించారు. ఢిల్లీకి వెళ్తే అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని, చెప్పులు ఎత్తుకుపోతామనేలా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పు పుడితే ఉద్యోగుల కోసం ఏదో ఒకటి చేసేవాడినని చెప్పారు. స్వీయ నియంత్రణే తమ ముందు ఉన్న పరిష్కారమని, ఉన్న సంసారాన్ని గౌరవంగా నడుపుకుంటే ఎవరైనా నమ్మి అప్పులు ఇస్తారని చెప్పారు. పరువును బజారులో పడేయవద్దని కుటుంబ పెద్దగా కోరుతున్నానని అన్నారు. లెక్కలు కావాలంటే అణా పైసలతో చెబుతానని, మిగిలిందంతా ఉద్యోగులకే పంచిపెడతానని ప్రకటించారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగులో పెట్టిందని, వాటికి రూ. 7 వేల కోట్లు కావాలని అన్నారు. ఏ ప్రభుత్వ విభాగానికి కూడా పట్టుమని వెయ్యి కోట్లు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కింద వేసిన రోడ్లకు మరమ్మతులు లేవని చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్థిక మంత్రితో కూర్చొని మాట్లాడాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 05:58 AM