BC Reservation Revanth Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్సే అడ్డు
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:33 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలే అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు కనీస నైతిక మద్దతు తెలపకుండా బీఆర్‌ఎస్, రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతాయంటూ బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లకు అవి వ్యతిరేకం.. అపాయింట్మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై మోదీ, షా ఒత్తిడి
ప్రయత్నాలన్నీ చేశాం.. రాష్ట్రపతే చొరవ తీసుకోవాలి
జీవో ఇస్తే కోర్టుల్లో.. వాయిదా వేస్తే నిధులకు.. చిక్కు
రాజకీయ పార్టీలు 42ు టికెట్లు ఇవ్వడం చివరి మార్గం
ముస్లింలను బూచిగా చూపి రిజర్వేషన్లు అడ్డుకునే కుట్ర
చెట్టుకింద ప్లీడర్, గల్లీ లీడర్‌లా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
బీజేపీది మొదటి నుంచీ ఓబీసీల వ్యతిరేక వైఖరే
పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు
ఓబీసీ రిజర్వేషన్లు అంటే మాత్రం నాన్చుతున్నారు
ఝార్ఖండ్ వెళ్లినందుకే బీసీ ధర్నాకు రాహుల్ రాలేదు
మంత్రులు, పీఏసీతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ
ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలే అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు కనీస నైతిక మద్దతు తెలపకుండా బీఆర్‌ఎస్, రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతాయంటూ బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని సీఎం మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపామని, ఆయన ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారని తెలిపారు. ఆ బిల్లులను ఆమోదించాలని విన్నవించేందుకు తాము రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి పది రోజుల క్రితమే అవకాశం అడిగామన్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా.. రాష్ట్రపతిని కలిశారని, వారిద్దరి ఒత్తిడితోనే తమకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించలేదని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలంటే మోదీని గద్దె దించడం ఒక్కటే మార్గమని చెప్పారు. బీజేపీది తొలి నుంచి బీసీ వ్యతిరేక వైఖరేనని రేవంత్‌రెడ్డి అన్నారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలును అడ్డుకొనేందుకు బీజేపీ కమండల్ యాత్ర(రథయాత్ర)ను ప్రారంభించిందని చెప్పారు. మన్మోహన్ హయాంలో ఉన్నత కేంద్రీయ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చినపుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో అడ్డుకొనే ప్రయత్నం చేసిందన్నారు. ప్రస్తుతం ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటోందని ఆరోపించారు. 2017లో రాజస్థాన్‌లో అబ్దుల్ సత్తార్ అనే ముస్లిం వ్యక్తి ఓబీసీ కోటాలో ఐఏఎ్‌సకు ఎంపికయ్యారని, 1971 నుంచి నూర్‌బాషా తదితరులకు బీసీ రిజర్వేషన్ల ఫలాలు అందాయని ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చామని మోదీ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బీజేపీతో అంటకాగుతూ బీఆర్‌ఎస్ ఓబీసీ రిజర్వేషన్లకు శిఖండిలా అడ్డుపడుతోందని ఆరోపించారు.
పీఏసీతో భేటీ తర్వాత కార్యాచరణ.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇక ముందు ఏం చేయాలనే దానిపై హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)తో భేటీ అవుతామని చెప్పారు. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ‘‘మూడు రోజులుగా ఢిల్లీలో అన్ని ప్రయత్నాలు చేశాం. మంత్రివర్గంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం ఢిల్లీలోనే ఉన్నాం. ధర్నాకు ఇండియా కూటమిలోని 100 మంది ఎంపీలు హాజరై మద్దతు తెలిపారు. పార్లమెంటులో చర్చకు వాయిదా తీర్మానాలు ఇస్తే ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేశాం. కేంద్రం నుంచి ఏ మాత్రం సహకారం లభించడం లేదు. తక్షణమే ఆ బిల్లులను ఆమోదించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి అన్నారు. శిబు సోరెన్ అంత్యక్రియలు, ఓ కేసులో జార్ఞండ్ వెళ్లాల్సి రావడం వల్లే రాహుల్ జంతర్ మంతర్ ధర్నాకు రాలేక పోయారని రేవంత్ వివరించారు. ఆయనకు బీసీల సమస్యపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపుపై తమ ప్రజెంటేషన్‌ను నాలుగు గంటలు సావధానంగా విన్నారని చెప్పారు. తెలంగాణ నమూనాను దేశమంతా తెలియజేసేందుకు తలకటోరా స్టేడియంలో జాతీయ స్థాయి సదస్సు పెట్టి వివరించారని గుర్తు చేశారు. రాహుల్ రాలేదని అంటున్న బీజేపీ నేతలు బీసీల కోసమైనా ధర్నా స్థలానికి రావొచ్చు కదా? అని ప్రశ్నించారు. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిన బీజేపీకి బీసీ రిజర్వేషన్లపై ఎందుకు మనసు రావడం లేదని అడిగారు. చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజులోనే పూర్తి చేయొచ్చన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వాదనలు చెట్టుకింద ప్లీడర్‌లా, గల్లీ లీడర్‌లా ఉన్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముస్లింలు ముఖ్యమంత్రులు కావద్దనేలా ఆయన మాట్లాడటం సరికాదన్నారు. ముస్లింలను రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర కాంగ్రె్‌సకు ఉందన్నారు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు చెబుతున్నారని, ఎలా తొలగిస్తారో? ఎలా పెంచుతారో? చేసి చూపించాలని సవాలు విసిరారు.
మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు
బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రిజర్వేషన్లతో కేంద్ర హోంశాఖతో సంబంధం లేనందున అమిత్ షా అపాయింట్మెంట్ కోరలేదని చెప్పారు. రిజర్వేషన్ల అమలుపై త్వరలోనే బీసీ సంఘాలు, బీసీ భాగస్వాములతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గురువారం రాత్రి రాహుల్‌గాంధీ కొంతమంది ఆత్మీయులకు విందు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆ విందుకు హాజరయ్యారు.
మా ముందు 3 మార్గాలు
42 శాతం రిజర్వేషన్ల అమలుకు చివరి వరకు ప్రయత్నిస్తామని, కుదరని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం మీడియా ప్రతినిధులతో రేవంత్ చిట్‌చాట్‌గా మాట్లాడారు. రిజర్వేషన్ల అమలుకు తమ వద్ద మూడు మార్గాలు ఉన్నాయన్నారు. 50 శాతం సీలింగ్‌కు అనుగుణంగా గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వడం ఒక మార్గమని చెప్పారు. జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గమని చెప్పారు. దీనివల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని, గ్రామాల్లో వ్యవస్థలు కుప్ప కూలుతాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపితే రాష్ట్రానికే నష్టమన్నారు. మూడో మార్గం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని, ఈ అంశాన్ని తాము అమలు చేయడమే కాకుండా ఇతర పార్టీలను కూడా అమలు చేసే విధంగా ఒత్తిడి తెస్తామని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు