BRS Party: గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:00 PM
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.
అచ్చంపేట, ఆగస్ట్ 07: బీఆర్ఎస్ పార్టీకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేత, మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. గురువారం అచ్చంపేటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తమ్ముడు, సోదరుడు గువ్వల బాలరాజు తాను చెప్పినా.. వినకుండా పార్టీ వీడి వెళ్లారని పేర్కొన్నారు. అలా వెళ్లిన గువ్వల బాలరాజు ఆరు నెలలో పశ్చాతాప పడక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. అతడిని బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీని వీడడం.. కార్యకర్తలను మోసం చేసి వెళ్లి పోవడం పద్ధతి కాదంటూ గువ్వల బాలరాజుకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు.
గువ్వల బాలరాజు పార్టీ వీడినా.. కార్యకర్తలు మాత్రం ఎవరు పార్టీని విడకుండా ఉండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీ అందరిని అభినందిస్తున్నానన్నారు. మరికొద్ది రోజుల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడంతోపాటు.. అందుకు సహకరించే బాధ్యత తనదని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు ఆయన భరోసా ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సంఘీభావంగా అచ్చంపేట నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సన్నాహాక సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులను తీసుకువస్తానని ఈ సందర్బంగా కేడర్‌కు ఆయన హామీ ఇచ్చారు.
గుడ్ బై చెప్పింది అందుకేనా..
భారత రాష్ట్ర సమితికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగస్ట్ 4వ తేదీ అంటే సోమవారం రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పంపారు. ఆ లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం కోసం తాను తీసుకున్న నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నది కాదన్నారు. ఎంతో ఆలోచించి.. ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుని అనంతరం తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నట్లు ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సమయంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. కష్ట సమయంలో పార్టీని వీడడం తనకు బాధగా ఉన్నా.. భవిష్యత్తు కోసం తప్పడం లేదని ఆ లేఖలో బాలరాజు వివరించారు.
మరోవైపు.. గువ్వల బాలరాజు ఆడియో అంటూ ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అంతేకాకుండా ఆయన మరికొద్ది రోజుల్లో బీజేపీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం సైతం సాగుతోంది. గతంలో అచ్చంపేట నుంచి రెండు పర్యాయాలు బాలరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నుంచి ఆయన పార్టీకి కొద్దిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు
For More Telangana News And Telugu News