Spider Bite: కుట్టిన సాలీడు.. బాలిక మృతి
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:34 PM
గతంలో పాములు కుడితే చనిపోయే వారు. కానీ నేడు దోమలు కుడితే చనిపోయే రోజులు వచ్చేశాయి. అందుకు కళ్ల ముందు ఎన్నో ఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. అలాంటి వేళ.. సాలీడు కుట్టడంతో ఒక బాలిక చనిపోయింది.
గౌహతి, ఆగస్ట్ 07: సాలీడు కుట్టడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన తూర్పు అసోంలో టిన్సుకియా జిల్లాలోని పానిటోల గ్రామంలో చోటు చేసుకుంది. గుడ్లు తీసేందుకు బాలిక వెదురు బుట్టలోకి ఆ బాలిక చేయి పెట్టింది. దీంతో ఆమె చేతిని సాలీడు కుట్టింది. ఆ వెంటనే ఆమె చేయి బాగా వాచిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం టిన్సుకియా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కానీ ఆసుపత్రికి చేరుకునే సరికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. అసహజ మరణంగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా బాలికను శరీరంపై కుట్టిన ప్రాంతంలోని నమూనాలను వైద్యులు సేకరించి.. పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నల్లని సాలీడు ఆ బాలికను కుట్టిందని పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు విచారణలో భాగంగా వెల్లడించారు.
సాలీడు కుట్టడంతో బాలిక మరణించిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అసోంలోని అటవీ ప్రాంతాలలో అధికంగా చెట్లు నరికి వేయడంతోపాటు భారీగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని చాలా కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జీవ వైవిధ్యానికి భారీ ముప్పు ఏర్పడుతుందంటూ సర్వత్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా ఘటనలు కారణంగానే.. అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన జంతువులు, విష కీటకాలు.. జనావాసాల్లోకి చొచ్చుకు వస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. వాటి వల్ల ప్రజలు మరణానికి చేరువతున్నారనే చర్చ సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాగుతోంది.
సాలీడు కుడితే ఇంత డేంజరా..
గతేడాది సెప్టెంబర్‌లో బ్రిటన్‌కు చెందిన నైజెల్ హంట్ (53) విహారయాత్ర కోసం సిసిలీకి వెళ్లి ఊహించని ప్రమాదంలో పడ్డారు. అతడి పొట్టను సాలీడు కుట్టింది. పెద్దగా నొప్పి అనిపించకపోవడంతో.. అతడు ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాడు. కొన్ని గంటల తర్వాత.. అతడి పొట్టపై దద్దురు వచ్చింది. దురద కూడా మొదలైంది. దీనిని సైతం అతడు లైట్ తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత సాలీడు కుట్టిన ప్రాంతంలో పెద్ద రంధ్రం ఏర్పడి.. కుళ్లినట్లు అయింది. దీంతో అతడు వెంటనే వైద్యులను సంప్రదించాడు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడు నెక్రొటైసింగ్ ఫాసైటిస్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీనిని సాధారణ భాషలో చెప్పాలంటే.. ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ అని పేర్కొంటారు. గాయమైన భాగంలో బ్యాక్టీరియా చేరి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తూ.. ఆ ప్రాంతంలోని కండంతా కుళ్లిపోయేలా చేస్తాయి. ఇలా కుళ్లిపోయిన కణాలు రాలి కింద పడిపోవడంతో పెద్ద రంధ్రంగా మారుతోంది. అయితే అతడికి వెంటనే శస్త్రచికిత్స చేసి.. ఆ గాయాన్ని నయం చేశారు. సరైన సమయంలో వైద్యం అందకుంటే.. అతడు మరణించి ఉండేవాడని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ-ఆధార్ యాప్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం
భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..
For More National News and Telugu News