Turaka Kishore: తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:52 PM
వైసీపీ నేత, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌కు ఊరట లభించింది. అతడిని తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.
అమరావతి, ఆగస్ట్ 07: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అతడి విడుదలపై కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని వెల్లడించింది. కిషోర్ అరెస్ట్ విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే మేజిస్ట్రేట్ మైండ్ అప్లై చేయలేదని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నామంటూ హైకోర్టు ధర్మాసనం కాస్తా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే తురకా కిషోర్ విడుదలకు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్‌ను ఆదేశించింది.
మరోవైపు తురకా కిషోర్‌కు ఇటీవల అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. దీంతో గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆ వెంటనే మరో కేసులో అతడిని రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కిషోర్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీస్ వాహనం ఎదుట తురకా కిషోర్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పక్కకు నెట్టి.. తురకా కిషోర్‌ను రెంటచింతల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం అతడిని జైలుకు తరలించారు. కిషోర్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు నేతలు మాచర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా వారి వాహనంపై తురకా కిషోర్ కర్రతో దాడి చేశారు. అనంతరం అతడిపై పలు కేసులు నమోదవుతున్నాయి. దీంతో గత కొద్ది నెలలుగా అతడు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.