CM Revanth: వరద సమస్యకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:32 AM
రాజధాని నగరంలోని బస్తీల్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటుచేసి ఈ సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు.. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం
హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన
బల్కంపేట, గంగుబాయి బస్తీ, మైత్రీవనం ప్రాంతాల్లో పరిశీలన
హడావుడి లేకుండా సాదాసీదాగా వెళ్లిన ముఖ్యమంత్రి
స్థానికుల్ని అడిగి సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆదేశాలు
సీఎంతో మంత్రి తుమ్మల భేటీ.. వ్యవసాయ శాఖ అంశాలపై చర
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలోని బస్తీల్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటుచేసి ఈ సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలి భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు, ప్రాంతాల్లోకి వరద రావడం, ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో.. ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు.
అమీర్‌పేట ప్రాంతంలోని మైత్రీవనం, గంగుబాయి బస్తీ, బౌద్ధనగర్, బల్కంపేటలోని బస్తీలను పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ముంపు సమస్య ఎన్నేళ్లుగా ఉంది, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటనేది నేరుగా బస్తీవాసులను ఆరా తీశారు. కాగా, బల్కంపేట నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి అడ్డుగా కొన్ని ఇళ్లను నిర్మించడం వల్ల సమస్య వస్తోందని అధికారులు సీఎం వివరించారు. ఎస్‌ఆర్‌నగర్ నుంచి బౌద్ధనగర్ వరకు ఉన్న డ్రైనేజీ కాలువను చూసి సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించి.. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గంగుబాయి బస్తీ కుంట ప్రాంతాన్ని సందర్శించిన సీఎం.. అక్కడి నాలా, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు. ఇళ్లలోకి నీరు రాకుండా రెండు వైపులా గోడలాంటి నిర్మాణం ఏర్పాటు చేయడం వల్ల మధ్యలో నుంచి వరద నీరు వేగంగా రావడాన్ని గమనించారు. అక్కడి కుంటను కొంతమంది పూడ్చివేసి ఓ హాస్పిటల్ పార్కింగ్‌కు వినియోగిస్తున్నారని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగానే వరదనీరు వెనక్కి వస్తూ బస్తీ మునిగిందని అధికారులు తెలిపారు. దీంతో పూర్వాపరాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు.
ప్యాచ్‌వర్క్ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, శాశ్వత పరిష్కారం కింద మొత్తం రీ డిజైన్ చేసి నీరు బయటకు వెళ్లటానికి ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్‌తో అన్నారు. బౌద్ధనగర్‌లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ కనిపించిన జశ్వంత్ అనే బాలుడిని సీఎం పిలిచారు. కాలనీలో వరద పరిస్థితిపై అతణ్ని అడిగి ఆరా తీశారు. బాలుడి వివరాలు అడగ్గా.. తాను ఏడో తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరదనీరు రావడంతో పుస్తకాలు తడిసిపోయాయని చెప్పాడు. దీంతో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. కొంతమంది బస్తీవాసులు తమ సమస్యలను విన్నవించగా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ సీఎం రేవంత్‌కు రాఖీ కట్టారు. పర్యటనలో పలువురు జీహెచ్‌ఎంసీ కార్మికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
హడావుడి లేకుండా సీఎం పర్యటన
సీఎం రేవంత్‌రెడ్డి అమీర్‌పేటలోని బస్తీల్లో ఎలాంటి హడావుడి, ముందస్తు సమాచారం కూడా లేకుండానే పర్యటించారు. పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు ఎవరూ లేరు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ కేతినేని సరళ ఒక్కరే సీఎం వెంట ఉండి సమస్యలను వివరించారు.

సీఎం రేవంత్‌తో మంత్రి తుమ్మల భేటీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. వ్యవసాయశాఖకు సంబంధించిన అంశాలు, శాఖ పురోగతి, సంక్షేమ పథకాలతోపాటు శాఖాపరమైన సమస్యలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తుమ్మల తీసుకెళ్లారు. వ్యవసాయ శాఖపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి చెప్పిననట్లు సమాచారం. సిద్దిపేటలో పామాయుల్ పరిశ్రమ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని, అనువైన తేదీని ఇవ్వాలని సీఎంను మంత్రి తుమ్మల కోరారు. దీంతోఈ నెలాఖరులో ప్రారంభోత్సవం చేద్దామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. సిద్దిపేటలో రిఫైన్డ్ ఆయిల్ యూనిట్ ఏర్పాటు అంశంపైనా చర్చ జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న తుమ్మల ఆ జిల్లాకు సంబంధించిన అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
అమీర్‌పేట జోన్‌గా డ్రైనేజీ, నాలాలను మారుస్తాం
మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం
Read latest Telangana News And Telugu News