Ind Vs SA: ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధమే:తిలక్ వర్మ
ABN , Publish Date - Dec 14 , 2025 | 08:23 AM
ధర్మశాల వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య ఆదివారం మూడో టీ20 జరగనుంది. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ధర్మశాల వేదికగా నేడు టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్(Ind Vs SA) గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. మరోవైపు టీమిండియా పేలవ ప్రదర్శనతో రెండో మ్యాచులో ఓటమిని మూటగట్టుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ లేమి.. బ్యాటింగ్ ఆర్డర్ స్థిరత్వం లేకపోవడం వల్లే జట్టు ఓడిందని విమర్శలు వెల్లుతుత్తున్నాయి. అక్షర్ పటేల్‌ను మూడో స్థానంలో పంపి. శివమ్ దూబెను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కి దింపడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో భారత స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Varma) ఈ విషయంపై మాట్లాడాడు.
‘జట్టులో ఓపెనర్లు తప్ప మిగిలిన ఆటగాళ్లంతా ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్లు ఇమిడిపోయే విధంగా ఉండాలి. ఏ నిర్ణయమైనా జట్టు కోసమే. ఈ అంశంపై టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టంగా ఉంది. నా విషయానికే వస్తే.. మూడో స్థానం నుంచి మొదలు ఎక్కడ బ్యాటింగ్ చేయడానికైనా రెడీగా ఉన్నా. అందరూ అలాగే ఉన్నారు. వన్‌డౌన్‌లో అక్షర్ ఎన్నోసార్లు మంచి ప్రదర్శనలు చేశాడు. అది పరిస్థితులను బట్టి తీసుకున్న నిర్ణయమే’ అని తిలక్ వివరించాడు.
పేసర్లదే..
‘ధర్మశాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్లే జట్లు సన్నద్ధత ఉంటుంది. నేను అండర్ 19 స్థాయిలో ఇక్కడ మ్యాచులు ఆడాను. పిచ్‌ను పరిశీలిస్తే భారీ స్కోర్లు నమోదయ్యేలా కనిపిస్తోంది. ధర్మశాల పిచ్ పేసర్లకే అనుకూలించనుంది. టాస్ ఎలాగూ మన చేతిలో ఉండదు. అందుకే దేనికైనా సిద్ధంగా ఉండాలి. బంతిపై పట్టు సాధించేందుకు తడిచిన బంతితో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం’ అని తిలక్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ భారీ రికార్డుపై అభిషేక్ శర్మ కన్ను!
మెస్సి టూర్‌లో అరెస్ట్.. ఎవరీ శతద్రు దత్తా?