Shatadru Dutta: మెస్సి టూర్‌లో అరెస్ట్.. ఎవరీ శతద్రు దత్తా?
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:03 AM
కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి పర్యటన పీడకలగా మారిన విషయం తెలిసిందే. స్టేడియంలో మెస్సి ఎక్కువ సేపు లేడని అభిమానులు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో శతుద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతక ఆయన ఎవరంటే?
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి శనివారం కోల్‌కతా, హైదరాబాద్‌లో పర్యటించాడు. మెస్సి కోసం కొన్ని రోజుల ముందు నుంచే కోల్‌కోతాలో ఎంతో హడావుడి. అతడిని చూసేందుకు భారీ ధరలు పెట్టి టికెట్లు కొన్నారు. కానీ సాల్ట్‌లేక్ స్టేడియంలో అతడు గడిపిన సమయం.. కేవలం 22 నిమిషాలు. ఆ సమయంలో కూడా సెలెబ్రిటీలు, భద్రత సిబ్బంది అతడి చుట్టూ ఉండటంతో స్టేడియంలోని 50 వేల మందికి పైగా అభిమానుల్లో చాలా మందికి అతడిని చూసే అవకాశమే లేకపోయింది. మెస్సి త్వరగా వెళ్లిపోయాడనే ఆగ్రహంతో ఫ్యాన్స్ అంతా స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. నిర్వహణ లోపంతో ఒక్కసారిగా అంతా గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో ఈవెంట్ ప్రమోటర్ శతుద్రు దత్తా(Shatadru Dutta) అరెస్ట్ అయ్యాడు. ఇంతకీ ఎవరీయన?
శతుద్రు దత్తా.. కోల్‌కతా మెస్సి ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు. కోల్‌కతాకు మెస్సి రావడం అతడు పడ్డ కష్టానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. గోట్ టూర్ ప్రమోషన్ల బ్యానర్లు, పోస్టర్ల కింద ‘ఏ శతద్రు దత్తా ఇనిషియేటివ్’లో భాగంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మెస్సి రావడానికి ముందు విలేకరులతో శతద్రు మాట్లాడాడు. ‘14 ఏళ్ల తర్వాత మెస్సి ఇండియాకు వస్తున్నాడు. అభిమానులకు ఆయన్ని చూడటానికి ఇది గొప్ప అవకాశం. ఫుట్‌బాల్‌కు ఇంతకుముందు ఎప్పుడూ ఇంత మంది స్పాన్సర్లు రాలేదు. మెస్సి టూర్‌ను ఎంజాయ్ చేయండి’ అని తెలిపాడు.
గతంలో ఫుట్‌బాల్ దిగ్గజాలు పీలే, డియెగో మారడోనాలను భారతదేశానికి తీసుకురావడంలో కూడా దత్తా కీలక పాత్ర పోషించారు. దిగ్గజ పోర్చుగీస్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోను కూడా ఇండియాకు తీసుకురావాలనే తన కోరిక గురించి దత్తా మాట్లాడారు.
ముందే వెళ్లడానికి కారణం అదేనా?
మెస్సి మైదానంలోకి రాగానే చుట్టూ రాజకీయ నాయకులు, వీఐపీలు, పోలీసు అధికారులు తన చుట్టూ వలయంలా ఏర్పడటంతో మెస్సి అయోమయానికి గురైనట్లు కనిపించాడు. మైదానంలో తిరగడానికి ప్రయత్నిస్తూ.. అసౌకర్యంతోనే మాజీ ఆటగాళ్లకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. పరిస్థితి గందరగోళంగా మారుతోందని గ్రహించిన ప్రమోటర్ శతద్రు వెంటనే స్పందించాడు.
‘దయచేసి అతడిని ఒంటరిగా వదిలేయండి. మైదానాన్ని ఖాళీ చేయండి’ అని మైకులో పదే పదే వేడుకున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. అక్కడున్న సెలెబ్రిటీలు ఎవరూ అతడి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. మెస్సి చుట్టూ గుమిగూడడాన్ని కొనసాగించారు. అంతా అయోమయంగా మారడంతో మెస్సిని 22 నిమిషాల్లోనే భద్రత మధ్య మైదానం నుంచి తీసుకెళ్లారు. నిజానికి షెడ్యూలు ప్రకారం అతడు.. స్టేడియంలో గంటసేపు ఉండాలి.
టికెట్ డబ్బులు తిరిగిస్తాం..!
సాల్ట్‌లేక్ స్టేడియంలో ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు కోల్‌కతా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఈవెంట్‌ను సరిగ్గా నిర్వహించకుండా గందరగోళానికి కారణమయ్యాన్నది ఆరోపణ. ప్రేక్షకులకు టికెట్ డబ్బులను వెనక్కిస్తామని నిర్వాహకులు లిఖితపూర్వక హామీ ఇచ్చినట్టు బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్