Messis Kolkata Tour Ends in Chaos: సాల్ట్‌లేక్‌లో రసాభాస
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:51 AM
అర్జెంటీనా దిగ్గజం కోల్‌కతాలో అడుగిడినప్పటి నుంచి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. అభిమాన ఆటగాడిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకొని.. భారీగా స్టేడియానికి చేరుకొన్న వారికి...
మెస్సీ కాసేపే కనిపించడంతో అభిమానుల గుస్సా
మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరి ఆగ్రహం
స్టేడియంలో విధ్వంసం, లాఠీచార్జ్
ఘటనపై సీఎం మమత విస్మయం
ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
అర్జెంటీనా దిగ్గజం కోల్‌కతాలో అడుగిడినప్పటి నుంచి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. అభిమాన ఆటగాడిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకొని.. భారీగా స్టేడియానికి చేరుకొన్న వారికి నిరాశే ఎదురైంది.
తన 70 అడుగుల విగ్రహాన్ని లియోనెల్ మెస్సీ వర్చువల్‌గా ఆవిష్కరించగా.. షారుక్ కూడా అక్కడే కలిశాడు. కానీ, సాల్ట్‌లేక్ స్టేడియంలో 10 నిమిషాలు మాత్రమే ఉండడం వివాదాస్పదమైంది. ఎన్నో ఆశలతో వచ్చిన తమకు లియోనెల్ కనపడకపోవడంతో.. ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకొంది.. రచ్చకు కారణమైంది.
కోల్‌కతా: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కోల్‌కతా పర్యటన రసాభాసగా ముగిసింది. తమ అభిమాన ఆటగాడు మెస్సీ కనిపించకపోవడంతో సాల్ట్‌లేక్ స్టేడియానికి తరలివచ్చిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో సాల్ట్‌లేక్ స్టేడియంలో బీభత్సం సృష్టించిన మెస్సీ అభిమానులు ఈవెంట్ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్న మెస్సీ.. మధ్యాహ్నం 12 నుంచి 12:30 మధ్య ఓ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ ఈవెంట్‌కు రూ.4500 నుంచి రూ.10,000ల లోపు ధరలతో సాధారణ అభిమానులకు టిక్కెట్లు విక్రయించారు. ధర అధికమే అయినా మెస్సీ ఆటను కళ్లారా చూసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు సాల్ట్‌లేక్ స్టేడియానికి పోటెత్తారు. దాదాపు 50వేల మంది అభిమానులు స్టేడియానికి వచ్చారని అంచనా. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మెస్సీ శనివారం ఉదయం 11:30 గంటల కల్లా సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకున్నాడు. మెస్సీ..మెస్సీ నినాదాలతో ఓ పక్క స్టేడియం హోరెత్తిపోతుండగా.. మెస్సీ వాహనం మైదానంలోని టచ్ లైన్‌కు చేరుకుంది. అయితే, మెస్సీ వాహనంలో నుంచి బయటకు దిగిన వెంటనే భద్రతా సిబ్బంది, రాజకీయ నాయకులు, వీఐపీలు ఇతర వ్యక్తులు ఆయన్ను చుట్టుముట్టేశారు. తోటి ఆటగాళ్లు సువారెజ్, రోడ్రిగోతో కలిసి గ్యాలరీల్లోని అభిమానులకు అభివాదం చేస్తూ మెస్సీ ముందుకు కదిలారు. కానీ, చుట్టూ చేరిన జనం వల్ల అభిమానులకు మెస్సీ ఏ మాత్రం కనిపించలేదు. స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్లు కూడా సరిగా పని చేయలేదు. ఆగ్రహించిన అభిమానులు నిర్వాహకుల తీరును నిరసిస్తూ మైదానంలోకి మంచినీళ్ల సీసాలు విసిరారు. దీంతో స్టేడియంలో నడుస్తున్న మెస్సీ వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇదంతా 10 నిమిషాల్లోనే జరిగిపోయింది. దీంతో షెడ్యూల్ ప్రకారం సాల్ట్‌లేక్ స్టేడియంలో జరగాల్సిన కార్యక్రమాలు హఠాత్తుగా ఆగిపోయాయి. ఆపై, మెస్సీ వెళ్లిపోయారనే విషయం తెలుసుకున్న అభిమానులు మరింత రెచ్చిపోయారు. గ్యాలరీల్లోని కుర్చీలు విరగొట్టారు. ప్రకటన బోర్డులను, ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్‌లను ధ్వంసం చేశారు. అంతటితో శాంతించని వందలాది అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లి మరింత హంగామా సృష్టించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు, అదనపు బలగాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురిపై లాఠీచార్జీ కూడా చేశారు. కాగా, సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విస్మయం వ్యక్తం చేశారు. మెస్సీకి, క్రీడాభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈవెంట్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమత.. జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. మరోపక్క, మెస్సీ ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అభిమానులకు టికెట్ డబ్బును వెనక్కి ఇస్తామని దత్తా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారని పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ విలేకరులతో అన్నారు.

ఈవెంట్ నిర్వాహకుడి అరెస్టు!
మెస్సీని ప్రత్యక్షంగా చూడాలన్న కోట్లాదిమంది భారత ఫుట్‌బాల్ అభిమానుల కలను సాకారం చేశాడు ఈవెంట్ ప్రమోటర్ శతద్రు దత్తా. కానీ కట్టుదిట్టమైన ప్రణాళిక లేకపోవడంతో సాల్ట్‌లేక్ స్టేడియంలో లియోనెల్ కార్యక్రమం రసాభాసా అయ్యింది. ఫలితం..మూడు రోజులు మెస్సీ వెంట ఉండాల్సిన దత్తా అరెస్టయ్యాడు. శతద్రుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) జావెద్ షమీమ్ వెల్లడించారు.
మాకేమీ సంబంధంలేదు: ఏఐఎఫ్‌ఎఫ్
సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన సంఘటనపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్) ఆందోళన వ్యక్తం జేసింది. అయితే ఆ ఉదంతంతో సమాఖ్యకు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపింది. ‘ఓ పౌర సంబంధాల సంస్థ ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఈవెంట్ అది. ఆ కార్యక్రమంలో సమాఖ్యకు ఎలాంటి పాత్ర లేదు. అసలు మెస్సీ పర్యటనకు సంబంధించి మాకు సమాచారమే ఇవ్వలేదు. మా అనుమతి కూడా అడగలేదు. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న అందరు వ్యక్తుల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలి’ అని ఏఐఎ్‌ఫఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
లియోనెల్ పరేషాన్
మెస్సీ 2011లో కోల్‌కతా పర్యటన ఎంత అద్భుతంగా సాగిందో..ఈసారి టూర్ అందుకు పూర్తి విరుద్ధంగా ముగియడం గమనార్హం. ఫుట్‌బాల్‌ను ఎంతో అభిమానించే బెంగాలీలు మెస్సీని ప్రత్యక్షంగా తిలకించేందుకు సాల్ట్‌లేక్ స్టేడియానికి పోటెత్తారు. ఎంతో ఉత్సాహంగా తరలివచ్చిన అభిమానులకు అక్కడ పరిస్థితి చూశాక ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. రాజకీయ నాయకులు, వీఐపీలు, ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు మెస్సీని చుట్టుముట్టారు. ఆటోగ్రా్‌ఫలకు, సెల్ఫీలకు పోటీపడడంతో స్టాండ్స్‌లోని ఫ్యాన్స్‌కు సాకర్ స్టార్ ఏమాత్రం కనిపించలేదు. మరోవైపు అందరికీ ఆటోగ్రా్‌ఫలిస్తూ, సెల్ఫీలకు సహకరిస్తూనే మెస్సీ మైదానంలో నెమ్మదిగా తిరిగాడు. కానీ నేతలు, వీఐపీల తాకిడి తగ్గకపోవడం మెస్సీ సైతం గందరగోళానికి లోనయ్యాడు. దాంతో మెస్సీ చుట్టూ ఉన్నవారు పక్కకు వచ్చి, గ్రౌండ్‌ను ఖాళీ చేయాలని ప్రమోటర్ శతద్రు దత్తా పదే పదే మైక్‌లో విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అభిమానులకు కోపం నషాళానికి అంటింది.

చలిని సైతం లెక్కచేయక..
సమయం తెల్లవారుజామున 2.26 గంటలు..వణికిస్తున్న చలి..రగ్గు కప్పుకొని ఇంట్లో వెచ్చగా నిద్రించాల్సిన సమయం..కానీ కోల్‌కతా సాకర్ ఫ్యాన్స్ చలిని లెక్క చేయలేదు. తమ ఆరాధ్య ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీని క్షణమైనా సరే ప్రత్యక్షంగా చూడాలన్న లక్ష్యంతో విమానాశ్రయానికి భారీగా తరలొచ్చారు. అర్జెంటీనా రంగులు కలిగిన జెండాలతో, మెస్సీ..మెస్సీ..అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టు బయటకు వచ్చిన అర్జెంటీనా స్టార్ నవ్వుతూ చేయి ఊపడంతో వారంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. దిగ్గజ సాకర్ ఆటగాడిని చూశామనే సంతృప్తితో వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్