Abhishek Sharma: కోహ్లీ భారీ రికార్డుపై అభిషేక్ శర్మ కన్ను!
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:37 AM
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీపై ఉన్న రికార్డును బద్దలు కొట్టేందుకు అత్యంత చేరువలో ఉన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: నేడు సౌతాఫ్రికా-టీమిండియా మధ్య మూడో టీ20 ధర్మశాల వేదికగా జరగనుంది. ఇందులో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీపై ఉన్న రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2016లో అద్భుత ఫామ్‌తో విరాట్(Virat Kohli).. 31 మ్యాచుల్లో 89.66 సగటుతో 1,614 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలున్నాయి. అభిషేక్ మరో 81 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డును బద్దలు కొడతాడు. ఈ ఏడాది అభిషేక్(Abhishek Sharma) ఇప్పటి వరకు 39 టీ20 మ్యాచులు ఆడి 1,533 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి.
ప్రొటీస్ జట్టుతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచులు ముగిశాయి. తొలి మ్యాచ్ ఘన విజయంతో ఆరంభించిన టీమిండియా.. రెండో మ్యాచులో చతికిల పడింది. దీంతో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచుల్లో అభిషేక్ దూకుడిగా ఆడినా భారీ స్కోర్లు చేయలేకపోయాడు. రెండు మ్యాచుల్లో కలిపి 34 రన్స్ మాత్రమే చేశాడు. నేడు జరిగే మూడో టీ20లో అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ఆడితే కోహ్లీ రికార్డు బ్రేక్ అవ్వడం ఖాయం.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్