Share News

Revanth Reddy Makes History: చరిత్ర సృష్టించిన రేవంత్ రెడ్డి.. మెస్సితో గేమ్ ఆడిన మొదటి సీఎంగా రికార్డ్

ABN , Publish Date - Dec 14 , 2025 | 06:51 AM

మెస్సి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ ఆడారు. ఇంటర్‌నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయిర్ మెస్సితో ఫుట్‌బాల్ ఆడిన మొదటి భారతీయ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు.

Revanth Reddy Makes History: చరిత్ర సృష్టించిన రేవంత్ రెడ్డి.. మెస్సితో గేమ్ ఆడిన మొదటి సీఎంగా రికార్డ్
Revanth Reddy Makes History

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి మూడు రోజుల పర్యటన కోసం ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన కోల్‌కతాలో పర్యటించారు. కోల్‌కతా పర్యటన సందర్భంగా తన విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ ఆడారు. ఇంటర్‌నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయిర్ మెస్సితో ఫుట్‌బాల్ ఆడిన మొదటి భారతీయ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు.


ముఖ్యమంత్రి రేవంత్ ఎంతో ఉత్సాహంగా గేమ్ ఆడారు. మెస్సికి గట్టి పోటీని ఇచ్చారు. అరగంటకు పైగా మెస్సి స్టేడియంలో ఉన్నారు. చిన్న పిల్లలతో కూడా ఆయన గేమ్ ఆడారు. వారిని ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో మెస్సి ముచ్చటించారు. దాదాపు 5 నిమిషాల పాటు వారి సంభాషణ సాగింది. మెస్సి హైదరాబాద్ పర్యటన ఎంతో ప్రశాంతంగా ముగిసింది. మెస్సితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడిన దృశ్యాల తాలూకా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


కోల్‌కతాలో రచ్చ రచ్చ..

మెస్సి కోల్‌కతా పర్యటనలో రచ్చ రచ్చ జరిగింది. మెస్సి శనివారం ఉదయం సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లారు. అక్కడ కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనను చూడ్డానికి గంటల పాటు వేచి ఉన్న అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఫుట్‌బాల్ ఆడకుండానే మెస్సి వెళ్లిపోయాడంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. పెద్ద మొత్తంలో కుర్చీలను విరగ్గొట్టారు. వాటిని స్టేడియంలోని ట్రాక్‌పై పడేశారు. స్టేడియం సిబ్బంది, పోలీసులు ఆపటానికి ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. ఇక, ఈ సంఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇందుకు నిర్వహణ లోపం కారణం అని ఆమె అన్నారు. మెస్సితో పాటు ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పారు.


ఇవి కూడా చదవండి

సాల్ట్‌లేక్‌లో రసాభాస

వెంటనే ఫీజు రీయింబర్స్‌ బకాయిలివ్వాలి

Updated Date - Dec 14 , 2025 | 07:55 AM