Share News

RCB IPL 2025 Title: చిరస్మరణీయం.. ఎన్నేళ్లో వేచిన ఉదయం.. ఆ రోజు నిజమైంది!

ABN , Publish Date - Dec 19 , 2025 | 01:13 PM

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ఆర్సీబీ కప్పును ముద్దాడింది. ఆ ఎమోషనల్ జర్నీ సాగిందిలా..

RCB IPL 2025 Title: చిరస్మరణీయం.. ఎన్నేళ్లో వేచిన ఉదయం.. ఆ రోజు నిజమైంది!
RCB IPL 2025 Title

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 3 2025.. కోట్లాది మంది అభిమానుల కళ్లు ఆనంద బాష్పాలతో తడిసిన రోజది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎన్ని పరాభవాలు.. ఎంత నిరాశ.. ఎన్ని నిట్టూర్పులు! అన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు సాధించింది రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు! ఐపీఎల్ ఆరంభం నుంచి జట్టును వీడని విరాట్ కోహ్లీ(Virat Kohli) చేతిలో ఐపీఎల్ ట్రోఫీని చూడాలన్న అభిమానుల కల ఇన్నేళ్లుకు నెరవేరింది.


ఒకడు జట్టుపై ఎంతో ప్రేమ చూపిస్తే.. అది క్రికెట్! ఒక ప్లేయర్ కోసం జట్టు కోసం ప్రాణమిచ్చేంత అభిమానం పెంచుకుంటే.. అది క్రికెట్! సాటి జట్లు కూడా ఒక ప్లేయర్‌కు దడిస్తే.. అది క్రికెట్! ఒకడు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పెట్టుకుంటే.. అది క్రికెట్! కోట్ల మంది కళ్లప్పగించిన వేళ.. కష్టమనుకున్న మ్యాచ్‌ను ఆ జట్టు సాధించుకున్న తీరు అద్భుతం. అభిమానుల ఆశలకు రూపమిస్తూ.. ఐపీఎల్‌లో బెంగళూరు కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఆర్సీబీ... ఈ సాలా కప్ నమ్‌దూ!


అలా జరిగింది..

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో పంజాబ్‌తో తలపడిన ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 200 సాధించినా కాపాడుకోవడం కష్టమైన పిచ్‌పై బెంగళూరు చేసింది 190 పరుగులే! ఎలిమినేటర్‌లో ఇదే మైదానంలో రెండొందలపైన స్కోరు చేసిన ముంబై ఇండియన్స్‌ను ఓడించిన పంజాబ్‌కు ఈ లక్ష్యం ఒక లెక్కా అనిపించింది. కానీ, రజత్‌ పాటీదార్‌ సారథ్యంలోని బెంగళూరు బెదర్లేదు. పంజాబ్‌కు కళ్లెం వేసి ట్రోఫీ(IPL 2025) కైవసం చేసుకుంది. కృనాల్‌పాండ్య, భువనేశ్వర్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. కెరీర్‌ ఆరంభం నుంచి బెంగళూరు తరఫునే ఆడినా ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కెరీర్‌ చివర్లో తన అభిలాషను నెరవేర్చుకున్నాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్(18), విరాట్ జెర్సీ నంబర్(18) ఒకటే కావడం విశేషం.


అంబరాన్నింటిన సంబరాలు..

కప్ గెలవడం ఒక ఎత్తైతే.. ఈ చారిత్రక విజయాన్ని మరింత ప్రత్యేకం చేసింది మాత్రం ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్. ఆర్సీబీ తరఫునే ఆడిన వీరిద్దరూ ఆ జట్టు జెర్సీ వేసుకుని మైదానం అంతా కలియ తిరుగుతూ ఉంటే.. ప్రతి అభిమాని హృదయం ఆనందబాష్పాలతో ధ్రవించింది. విరాట్, ఏబీడీ, గేల్.. కలిసి ట్రోఫీని ముద్దాడుతుంటే.. చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. ఆర్సీబీ జట్టులో వీరిద్దరి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ది మ్యాన్ బిహైండ్..

ఆర్సీబీ విజయాన్ని కోహ్లీ లేకుండా ఊహించలేం. 15 మ్యాచ్‌లు.. 657 పరుగులు.. 8 అర్ధ శతకాలు.. అద్భుతమైన ఫామ్. ట్రోఫీ ఎత్తిన క్షణం అతడి కళ్లలో కనిపించిన కన్నీళ్లు 18 ఏళ్ల ప్రయాణానికి సాక్ష్యం. ఆ రికార్డుల వీరుడుకి దక్కని ట్రోఫీ అంటూ లేదు.. ఒక ఐపీఎల్ తప్ప. ఎట్టకేలకు ఈ ఏడాది ఆ ట్రోఫీని కూడా ముద్దాడాడు.


చిన్నబోయిన సంబరం..

జూన్ 4న బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ, చిన్నస్వామి స్టేడియంలో ట్రోఫీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు 2.5 లక్షల మంది అభిమానులు స్టేడియం చుట్టూ చేరారు. ఆ విజయం తాలూకూ ఆనందం ఎక్కువ సేపు నిలవలేకపోయింది. అభిమానం కట్టలు తెంచుకుంది. ఫలితం.. తొక్కిసలాట. కళ్లు మూసి తెరిచేలోపు 11 మంది మృతి చెందారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ ఘటన ఈవెంట్ నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. నెలల నిశ్శబ్దం తర్వాత సెప్టెంబర్‌లో ఆర్సీబీ స్పందించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది.


విజయం… విషాదం… బాధ్యత.. ఈ మూడింటి మధ్య నిలిచిన ఆర్సీబీ.. 2026 సీజన్‌ను కొత్తగా ఆరంభించాలని భావిస్తుంది. మరిన్ని ట్రోఫీల ఆశతో… మరింత జాగ్రత్తతో… అభిమానుల భద్రతే లక్ష్యంగా ముందుకు సాగాలని సంకల్పిస్తోంది. RCB కథ ఇక కేవలం ఒక జట్టు కథ కాదు.. ఆనందం, బాధ, బాధ్యతల కలయికగా మారిన ఆధునిక ఐపీఎల్ గాథ.


ఇవీ చదవండి:

రోల్ బాల్ ప్రపంచ కప్ విజేతగా భారత్

మెస్సి కోల్‌కతా పర్యటన.. కోర్టును ఆశ్రయించిన గంగూలీ!

Updated Date - Dec 19 , 2025 | 01:39 PM