Don Bradman Auction: వేలానికి బ్రాడ్‌మన్ 'బ్యాగీ గ్రీన్' క్యాప్..
ABN , Publish Date - Dec 31 , 2025 | 07:50 AM
ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ప్రఖ్యాత ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో చివరిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న సమయంలో ధరించిన ఈ క్యాప్ వచ్చే ఏడాది జనవరి 26 వరకు వేలంలో ఉండనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియన్ లెజండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ప్రఖ్యాత ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్(Baggy Green Cap) అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో చివరిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న సమయంలో ధరించిన ఈ క్యాప్‌ను ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. 1947–48 సీజన్‌లో ఆసీస్ గడ్డపై భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో బ్రాడ్‌మన్ ఈ క్యాప్ ధరించాడు. అలానే బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో ఇండియాతో ఆడిన ఏకైక సిరీస్ ఇదే కావడం విశేషం. అలానే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా మొట్టమొదట ఆస్ట్రేలియాలోనే విదేశీ పర్యటన చేసింది. ఈ పర్యటనలో భారత్ 4-0తో ఓటమిపాలైంది.
ఇక.. 1947-48 మధ్య ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన ఈ సిరీస్‌లో బ్రాడ్‌మన్ 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 178.75 సగటుతో 725 పరుగులు చేశాడు. అందులో ఒక ద్విశతకం, మూడు శతకాలు, ఒక అర్ధ శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ్రస్టేలియా క్రికెటర్లకు ఒకసారి అరంగేట్ర సమయంలో బ్యాగీ గ్రీన్(Baggy Green Cap) ఇస్తే కెరీర్ చివరి వరకు దానినే వాడటం సంప్రదాయంగా వస్తోంది. అయితే 1947-48 కాలంలో ప్రతీ సిరీస్‌కు ఆసీస్ ప్లేయర్లకు కొత్త బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను అందించేవారు. అందువల్లే బ్రాడ్‌మన్‌కు చెందిన పలు క్యాప్‌లు వేర్వేరు మ్యూజియంలలో ఉన్నాయి. అలానే.. ఇతర క్యాప్‌లు, అవార్డులు, ఇతర బహుమతులు పలువురు ప్రైవేట్ వ్యక్తులు వేలం ద్వారా దక్కించుకున్నారు.
1947–48 సిరీస్ విషయానికి వస్తే.. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టుకు శ్రీరంగ వాసుదేవ్ సొహొ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సిరీస్ ముగిసిన అనంతరం వాసుదేవ్‌కు బ్రాడ్‌మన్(Don Bradman) తన క్యాప్‌ను బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుంచి గత 78ఏళ్లుగా ఈ క్యాప్ వాసుదేవ్ ఫ్యామిలీ వద్దే ఉంది. ఇప్పుడు దీనిని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఆక్షనర్ లాయిడ్స్ వేలం వేస్తున్నాడు. దీని ప్రారంభం ధర ఒక ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉంది. 2026 జనవరి 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి భారీ మొత్తం పలికే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఇదే సిరీస్‌లో బ్రాడ్‌మన్(Don Bradman) ధరించిన మరో క్యాప్‌ను వేలం వేస్తే దానికి ఊహించని విధంగా రూ.2.63 కోట్ల ధర పలికింది. మరి.. ఈ క్యాప్ ఎంత ధర పలుకుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
ఇవీ చదవండి:
సూర్యకుమార్ యాదవ్ పదే పదే మెసేజ్ చేసేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!