RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. జట్టు నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్!
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:44 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ డబ్య్లూపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్(WPL) సందడి ఇప్పటికే మొదలైంది. జనవరి 9 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ డబ్య్లూపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
డబ్ల్యూపీఎల్ 2024లో ఆర్సీబీ విజేతగా నిలవడంలో పెర్రీ(Elise Perry) కీలక పాత్ర పోషించింది. ఆమె గైర్హాజరీతో జట్టు బలహీన పడనుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెర్రీ స్థానంలో మహారాష్ట్రకు చెందిన ఆర్సీబీ సయాలీ సత్ఘరే(Sayali Satghare)ను తీసుకుంది. రూ.30 లక్షల కనీస ధరకే ఆమెను జట్టులోకి తెచ్చుకుంది. పెర్రీ గత కొంత కాలంగా గాయాలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె చీలమండ గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి కూడా..
ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అన్నబెలె సదర్లాండ్ కూడా డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె గైర్హాజరీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తీవ్ర నష్టం చేయనుంది. అన్నాబెల్ సదర్లాండ్(Annabel Sutherland) స్థానంలో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అలనా కింగ్ జట్టులో చేరనుంది. గత సీజన్‌లో యూపీ వారియర్స్ తరఫున ఆడిన అలనాను రూ. 60 లక్షల కనీస ధరకు ఢిల్లీ దక్కించుకుంది. ఆమె ఇప్పటివరకు 27 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టింది.
తారా నొర్రిస్ కూడా..
అమెరికా ప్లేయర్ తారా నొర్రిస్(Tara Norris) కూడా డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ నుంచి తప్పుకుంది. డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ఆమెను యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. అయితే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ నేపథ్యంలో తారా నొర్రిస్ డబ్ల్యూపీఎల్‌కు దూరం కానుంది. ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లు నేపాల్ వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి. డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనుంది. ఈసారి టోర్నీని రెండు అంచెలుగా నిర్వహించనున్నారు. నవీ ముంబై, వడోదర వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి పెర్రీ లేకపోవడం పెద్ద లోటుగానే కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
సూర్యకుమార్ యాదవ్ పదే పదే మెసేజ్ చేసేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!