Share News

Champions Trophy 2025: 60 బంతుల్లో సెంచరీ.. పాక్‌పై అతడి తాండవం.. యువరాజ్ జోస్యం అదిరింది

ABN , Publish Date - Feb 22 , 2025 | 01:14 PM

IND vs PAK: ఎంతో ఆసక్తి రేపుతున్న భారత్-పాకిస్థాన్ సమరంపై లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓ ప్లేయర్ ఊచకోతను చూడబోతున్నామని అన్నాడు.

Champions Trophy 2025: 60 బంతుల్లో సెంచరీ.. పాక్‌పై అతడి తాండవం.. యువరాజ్ జోస్యం అదిరింది
IND vs PAK

చాంపియన్స్ ట్రోఫీ-2025 హీటెక్కుతోంది. నిన్న మొన్నటి వరకు సాదాసీదా మ్యాచులతో సప్పగా సాగిన మెగా టోర్నీ ఇకపై వేడెక్కనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ దీనికి ఊతం ఇవ్వనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య దుబాయ్ వేదికగా సండే ఫైట్ జరగనుంది. ఇక మీదట ప్రతి జట్టు సెమీస్ కోసం స్పీడ్ పెంచే చాన్స్ ఉండటం, బడా టీమ్స్ ఒకరికొకరు ఎదురు పడనుండటంతో ఒక్కసారిగా టోర్నీలో వాతావరణం మారిపోనుంది. ఇండో-పాక్ ఫైట్‌తో ఒక రేంజ్‌లో వేడి పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌పై బోలెడు ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. తాజాగా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా జోస్యం చెప్పాడు. అతడు ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..


బౌలర్లకు పీడకలే!

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత సారథి రోహిత్ శర్మ చెలరేగి ఆడటం ఖాయమని అన్నాడు యువరాజ్. అతడు 60 బంతుల్లో 100 కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని జోస్యం పలికాడు. పాకిస్థాన్‌కు హిట్‌మ్యాన్ చుక్కలు చూపించడం పక్కా అని చెప్పాడు. ‘రోహిత్ గనుక ఫామ్‌లో ఉంటే 60 బంతుల్లోనే సెంచరీ బాదేస్తాడు. అతడి బ్యాటింగ్ క్వాలిటీ అది. అలాంటి విధ్వంసం అతడికే సాధ్యం. టచ్‌లోకి వస్తే బౌండరీలే కాదు.. సిక్సులతోనూ బౌలర్లను ఊచకోత కోస్తాడు. షార్ట్ బాల్‌ను కూడా అలవోకగా స్టేడియంలోకి తరలిస్తాడు. 145 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే బంతుల్నీ సులువుగా బౌండరీ లైన్ దాటించేస్తాడు. రోహిత్ స్ట్రైక్ రేట్ కూడా అద్భుతం. 120-140 స్ట్రైక్‌రేట్‌తో అతడు పరుగులు చేస్తాడు’ అని యువీ చెప్పుకొచ్చాడు.


వాయించకుండా వదలడు!

‘రోహిత్‌కు ఫామ్‌తో పని ఉండదు. అతడు ఆడే తీరులో ఏ మార్పూ ఉండదు. అతడో సిసలైన మ్యాచ్ విన్నర్. వైట్‌బాల్ క్రికెట్‌లో భారత్‌కు దొరికిన తోపు మ్యాచ్ విన్నర్ అతడు. టీమ్‌లో విరాట్ కోహ్లీ ఎలాగూ ఉన్నాడు. అతడూ తక్కువ తినలేదు. మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చే సత్తా వీరిద్దరికీ ఉంది. ఒకవేళ రోహిత్ స్ట్రగుల్ అవుతూ కూడా పరుగులు చేయడం మొదలుపెడితే మాత్రం అపోజిషన్ టీమ్‌కు చుక్కలే. అతడు వాయించకుండా వదలడు’ అంటూ పాక్‌ను హెచ్చరించాడు యువీ. ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్.. దమ్ముంటే రోహిత్‌ను ఆపండి చూద్దామంటూ రిజ్వాన్ సేనకు చాలెంజ్ విసురుతున్నారు.


ఇవీ చదవండి:

పగతో రగిలిపోతున్న రోహిత్

ఇండో-పాక్ మ్యాచ్.. ఐఐటీ బాబా ప్రిడిక్షన్ వైరల్

భారత్‌తో మ్యాచ్‌.. పాక్‌కు గట్టి షాక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2025 | 01:18 PM