Share News

ChatGPT Travel Advice Fail: చాట్ జీపీటీని నమ్ముకుని ఫ్లైట్ మిస్ చేసుకున్న ఇన్‌ఫ్లూయెన్సర్ కపుల్స్..

ABN , Publish Date - Aug 15 , 2025 | 06:19 PM

చాట్ జీపీటీ ఏ ప్రశ్నకైనా ఇట్టే సమాధానం చెబుతుందని అందరికీ తెలుసు. కచ్చితత్వం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మధ్య చాలామంది ట్రావెలింగ్ ప్లానింగ్ కోసం ఏఐ సాయం తీసుకుంటున్నారు. కానీ, చాట్ జీపీటీ సలహా నమ్మిన ఓ జంట డ్రీమ్ డెస్టినేషన్ చేరుకోలేకపోవడం నెట్టింట చర్చకు దారితీసింది.

ChatGPT Travel Advice Fail: చాట్ జీపీటీని నమ్ముకుని ఫ్లైట్ మిస్ చేసుకున్న ఇన్‌ఫ్లూయెన్సర్ కపుల్స్..
Influencer Couple Misses Flight due to ChatGPT advice

ప్రతి చిన్న అవసరానికి చాట్ జీపీటీ సలహా తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కువసేపు కష్టపడాల్సిన పనిలేకుండా తక్కువ సమయంలో కావాల్సిన సమాచారం అందిస్తుందనే నమ్మకం ప్రజల మనసుల్లో నాటుకుపోవడమే ఇందుకు కారణం. కానీ, ఈ నమ్మకమే ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ జంట కొంప ముంచింది. ఏ ప్రశ్నకైనా పర్ ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుందని ఏఐపై ఆధారపడి ఫ్లైట్ మిస్ అయింది. తమ డ్రీమ్ వెకేషన్ ఆగిపోవడానికి చాట్ జీపీటీనే కారణమంటూ వారు లబోలబోదిబోమంటూ నెట్టింట తమ అనుభవాన్ని పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో చాట్ జీపీటీ విశ్వనీయత హాట్ టాపిక్ గా మారింది.


స్పెయిన్‌కు చెందిన యువ ఇన్‌ఫ్లూయెన్సర్ మేరీ కెల్డాస్, ఆమె భర్త అలెజాండ్రో తమ డ్రీమ్ డెస్టినేషన్ ప్యూర్టో రికో వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, ఒకే ఒక తప్పిదం కారణంగా వాళ్ల సెలవులు వేస్ట్ అయిపోయాయి. చాట్ జీపీటీ సలహాపై ఆధారపడటం వల్ల డ్రీమ్ డెస్టినేషన్ చేరుకోలేక చతికిలపడ్డారు. ప్రయాణ పత్రాల విషయంలో చాట్ జీపీటీ తప్పుడు సలహా ఇవ్వడంతో ఫ్లైట్ ఎక్కలేకపోయారు ఆ జంట. ఇదే విషయాన్ని మేరీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.


చాట్ జీపీటీ సలహా తమ కలల ప్రయాణానికి ఎలా గండికొట్టిందో మేరీ నెట్టింట ఓ వీడియో ద్వారా పంచుకుంది. ప్యూర్టో రికోకు వెళ్లడానికి వీసా అవసరమా? అని చాట్‌జీపీటీ అడిగినప్పుడు 'లేదు' అని సరైన సమాధానం చెప్పలేదని.. అందువల్ల తాము తమ డ్రీమ్ డెస్టినేషన్ చేరుకోలేకపోయామని వాపోయింది. వాస్తవానికి స్పెయిన్, యూఎస్ వీసా వేవర్ ప్రోగ్రామ్‌లో ఉన్న ఇతర దేశాల పౌరులు.. ప్యూర్టో రికోకు వెళ్లడానికి వీసా అవసరం లేదు. కానీ, వారు ముందుగా ESTA (ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ అథరైజేషన్) అనుమతి పొందాలి. ఈ ప్రక్రియను వారు పరిగణనలోకి తీసుకోలేదు.


ESTA అనుమతి లేకపోవడంతో ఈ కపుల్స్ విమానంలో ఎక్కలేకపోయారు. ఈ ఘటనను మేరీ తన టిక్‌టాక్ వీడియోలో పంచుకున్నారు. ఇందులో ఆమె విమానాశ్రయంలో ఏడుస్తుండగా, అలెజాండ్రో ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో వివిధ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రయాణం కోసం చాట్ జీపీటీపై ఆధారపడటం చాలా తప్పని కొందరంటే.. అఫిషియల్ సోర్స్ నుంచి కాకుండా, చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా ఆధారపడితే ఇలాగే ఉంటుందని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రైలు ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండమనేది ఇందుకే.. ఇతడికేమైందో చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 15 , 2025 | 06:21 PM