Stree Shakti Scheme: ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:45 PM
మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడేదని తెలిపారు. కొంత మంది మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ, ఆగస్టు 15: ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా.. అది మహిళలతోనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయన్నారు.
మహిళలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతోందని గుర్తు చేశారు. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడేదని కొనియాడారు. కొంత మంది మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోని అన్న.. మహిళల గురించి మాట్లాడుతున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తామని హెచ్చరించారు మంత్రి లోకేష్. గతంలో మద్యపాన నిషేధం చేస్తానని ఓ రాక్షసుడు చెప్పాడన్నారు. కానీ.. జే బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. ఇతర మహిళలకు న్యాయం చేస్తారా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. తల్లి మీద కేసు గెలిస్తే.. సంబరాలు చేసుకున్నారంటూ జగన్‌పై మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు. తల్లి, చెల్లికి న్యాయం చేశాకే తన గురించి మాట్లాడాలని వారిని కోరుతున్నానంటూ వైసీపీ అగ్రనాయకత్వానికి లోకేష్ కియర్ కట్‌గా స్పష్టం చేశారు.
భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనన్నారు. మహిళల అభ్యున్నతికి పాటు పడుతున్నది టీడీపేనేనని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా అమలు చేసింది కూడా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆరే అని గుర్తు చేశారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు అమలు చేసింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిందీ సీఎం చంద్రబాబే అని వెల్లడించారు. మహిళలను అన్ని విధాలా అభివృద్ధి చేసేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారని వివరించారు. మహిళలను కించ పరిచేలా సీరియళ్లు, చిత్రాలు రాకుండా చట్టాన్ని తీసుకురావాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇవ్వడమే కానీ.. తీసుకోవడం తెలియని గొప్ప వారు మహిళలని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడే పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొత్త ఒరఒడిని ప్రారంభించారన్నారు. ప్రజలు ఆనందంగా ఉంటే చాలు.. అదే కోటి వరాల జల్లు అని సీఎం చంద్రబాబు భావిస్తారని తెలిపారు. హ్యాపినెక్ట్స్ ఇండెక్స్‌ను అమలు చేస్తున్నది సీఎం చంద్రబాబేనని ఈ సందర్భంగా మాధవ్ ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ మూడు రోజుల పాటు వర్షాలు..
For Mora AP News And Telugu News