Kavitha in KCR Farm House: ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత
ABN , Publish Date - Aug 15 , 2025 | 03:32 PM
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ కీలక నేతలతో శనివారం ఎర్రవల్లిలోని సమావేశం కావాలని నిర్ణయించారు. అలాంటి వేళ.. ఆ పార్టీ ఎమ్మెల్సీ, కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.
సిద్ధిపేట, ఆగస్టు 15: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం నాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. కవిత చిన్న కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అతడికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇప్పించేందుకు కవిత అత్తింటివారితో కలిసి ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తన కుమారుడితో కలిసి.. కవిత అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. 15 రోజులపాటు కవిత అమెరికాలో ఉండనున్నారు. కుమారుడిని అమెరికా యూనివర్శిటీలో జాయిన్ చేసి.. కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి.. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఇప్పటికే కవిత పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత.. కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.
మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పార్టీలోని కీలక నేతలను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు రావాలని ఆదేశించారు. దీంతో కేటీఆర్, హరీష్ రావులతోపాటు పలువురు కీలక నేతలు ఇప్పటికే ఎర్రవల్లికి పయనమయ్యారు. మరికొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్ట రిపోర్ట్ తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్‌లో వరంగల్ వేదికగా ఆ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ అనంతరం ఆ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు ఆయన కుమార్తె కవిత లేఖ రాయడం.. ఆ లేఖ ఇటీవల బహిర్గతం కావడంతో.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలకు ఆయుధం దొరికినట్లు అయింది. అంతేకాకుండా.. బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఈ లేఖ ద్వారా బహిర్గతమైనట్లు అయింది. దీంతో కవితతో కేసీఆర్, కేటీఆర్‌లు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సైతం సాగుతోంది. అలాంటి వేళ.. కవిత శుక్రవారం ఎర్రవల్లిలోని తన తండ్రి ఫామ్‌హౌస్‌కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం
బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ పిలుపు.. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్ సహా ముఖ్య నేతలు
Read Latest Telangana News and National News