Share News

CREDAI హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:53 PM

పెట్టుబడులకు రక్షణ కల్పించడమేకాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది.. మాది. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరే. అలాంటి అపోహలను తొలగించడానికే ఇక్కడికి వచ్చా.

CREDAI హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం
CM Revanth Reddy at CREDAI Property Show

హైదరాబాద్, ఆగస్టు 15: CREDAI నిర్వహిస్తోన్న హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. అపోహలు, అనుమానాలను దాటుకుకుని రాష్ట్ర అభివృద్ధిలో ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని సీఎం చెప్పారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నానని సీఎం తెలిపారు. ప్రభుత్వం పాలసీ, కన్‌స్ట్రక్షన్ రెండూ.. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి అని సీఎం అన్నారు.


పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కొంతకాలం అనుమానాలు, అపోహలకు తావిస్తుంది. పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడులకు రక్షణ కల్పించడమేకాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది.. మాది. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరే. అలాంటి అపోహలను తొలగించడానికే ఇక్కడికి వచ్చా. ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే మేము… ఇక్కడే ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం?' అని సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


పెట్టుబడుల విషయంలో మీకే మా మొదటి ప్రాధాన్యత అని క్రెడయ్ నిర్వాహకుల్ని ఉద్దేశించి ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. 'నేను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని. కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్న వాడిని కాదు. సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా..అందుకే మీరు అడిగిన కొన్నింటికి నేను అంగీకరించకపోవచ్చు.. నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను.. పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు నాకు అభ్యంతరం లేదు.' సీఎం క్లారిటీ ఇచ్చారు.

Updated Date - Aug 15 , 2025 | 01:53 PM