FASTag Annual Pass: రూ.3 వేలకే ఫాస్టాగ్ వార్షిక పాస్.. ఎలా పొందాలంటే?
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:10 PM
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభించింది. ఈ పాస్ వాణిజ్యేతర, ప్రైవేట్ వాహనాలకు టోల్ ఖర్చులను తగ్గిస్తుంది. దీన్నెలా యాక్టివేట్ చేసుకోవాలి? బెనిఫిట్స్ ఏంటి?ఎవరెవరు అర్హులు? తదితర పూర్తి సమాచారం ఈ కథనంలో..
కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభించింది. నేషనల్ హైవే (NH), నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే (NE)పై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారులకు వార్షిక టోల్ పాస్ (FASTag annual pass) ను ప్రవేశపెట్టింది. NHAI ప్రవేశపెట్టిన కొత్త FASTag వార్షిక పాస్ వాహనదారుల డబ్బు ఆదా చేసే గొప్ప మార్గం. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి రవాణా శాఖ 'రాజ్‌మార్గ్ యాత్ర' యాప్‌లో ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంచింది. అంతేకాదు, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), రహదారి రవాణా, హైవే మంత్రిత్వశాఖ (MoRTH) అధికారిక వెబ్‌సైట్లలో కూడా ఈ లింక్ దొరుకుతుంది. ఈ పాస్ ప్రత్యేకంగా కార్లు, జీపులు, వ్యాన్ వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.
కొన్ని నెలల కింద కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఈ పాస్ గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. టోల్ ఛార్జీ సగటు ధరను తగ్గించేందుకు ఈ పాస్ ఉపయోగపడుతుంది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ద్వారా వాహనదారులు సంవత్సరానికి లేదా 200 ట్రిప్పుల వరకూ (ఏది ముందైతే అది) జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. ట్రిప్పు అంటే ఒక టోల్ గేట్ దాటటం. ఉదాహరణకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి 5 టోల్ గేట్లను దాటవలసి వస్తే అది 5 ట్రిప్పులుగా లెక్కిస్తారు. అదే దారిలో తిరుగుప్రయాణమైతే మళ్లీ 5 ట్రిప్పులు పూర్తవుతాయి. మొత్తంగా చూస్తే 10 ట్రిప్పులు పూర్తవుతాయి. పాత ఫాస్టాగ్ ఉన్నవారు దానినే వినియోగించి ఈ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కొత్త ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేదు.
పాస్ ఎలా పొందాలి?
ఈ పాస్‌ను 'రాజ్‌మార్గ్ యాత్ర' అనే మొబైల్ యాప్ లేదా NHAI వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ సందర్భంగా మీ వాహనం, FASTag అర్హత తనిఖీ చేస్తారు. తర్వాత రూ.3000 (UPI, కార్డ్, నెట్ బ్యాంకింగ్) చెల్లింపు చేశాక యాక్టివేట్ అవుతుంది. పరిమితి లేదా సమయం ముగిసిన తర్వాత పాస్‌ను మళ్ళీ పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఈ పాస్‌తో, టోల్ ఛార్జీల సగటు ఖర్చు రూ. 50 నుండి రూ. 15 కి తగ్గుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ వార్షిక పాస్ తీసుకోకపోయినా లేదా తక్కువ ట్రిప్పులు ప్రయాణించేవారు ప్రస్తుత ఫాస్టాగ్ విధానం ద్వారా సాధారణ టోల్ చెల్లింపులు కొనసాగించవచ్చు.
పాస్ యాక్టివేషన్ విధానం
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో 'రాజ్‌మార్గ్ యాత్ర' యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
NHAI, MoRTH అధికారిక వెబ్‌సైట్లలో కూడా యాక్టివేషన్ లింక్ అందుబాటులో ఉంటుంది.
మొబైల్ నెంబర్, వాహన నెంబర్, ఫాస్టాగ్ వివరాలు నమోదు చేసి లాగిన్ కావాలి.
ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా రూ.3,000 చెల్లించాలి.
చెల్లింపులు పూర్తయిన రెండు గంటలలోపు పాస్ యాక్టివేట్ అవుతుంది. SMS ద్వారా ధృవీకరణ వస్తుంది.
ఎక్కడ పని చేస్తుంది?
ఫాస్టాగ్ వార్షిక పాస్ NHAI నిర్వహించే NH, NE టోల్ ప్లాజాలలో మాత్రమే చెల్లుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో పనిచేయదు.
ఒక పాస్ ఎన్ని వాహనాలకు చెల్లుతుంది?
ఒక వాహనానికి మాత్రమే చెల్లుతుంది. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ లింక్ పూర్తయిన వాహనానికి మాత్రమే ఈ పాస్ పనిచేస్తుంది. మరొక వాహనానికి ఉపయోగిస్తే అది డీయాక్టివేట్ కావచ్చు. అలాగే, విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్‌ను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయడం ముఖ్యం. లేకుంటే అది బ్లాక్‌లిస్ట్ చేసే ఛాన్స్ ఉంది.
ఇవీ చదవండి:
రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగేపాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం