Blood Moon 2025: ఈ రాత్రే బ్లడ్ మూన్.. 82 నిమిషాల పాటు ఆకాశంలో అరుదైన దృశ్యం..!
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:29 PM
తెల్లని రంగులో మిలమిల మెరిసిపోయే చంద్రుడిని ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ, ఇవాళ(ఆదివారం) ప్రత్యేకం. అరుదైన చంద్రగ్రహణం కారణంగా సూర్యుడిని తలపించేలా చంద్రుడు ఎరుపు వర్ణంతో ధగధగలాడిపోతాడు. ఏకంగా 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్‌గా కనువిందు చేయనున్నాడు. ఇండియాలో ఎక్కడెక్కడ? ఏం టైంలో చూడొచ్చంటే?
ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రియులకు ఇవాళ (ఆదివారం) పండగే. ఎందుకంటే అత్యంత అరుదైన చంద్రగ్రహణం కారణంగా ఏకంగా 82 నిమిషాల పాటు ఆకాశంలో అద్భుత దృశ్యాలు వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈ రోజున చంద్రుడు బ్లడ్ మూన్‌గా ఎక్కువసేపు దర్శనమిస్తాడు. ఈసారి చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ అవతారంలో చంద్రుడు ప్రజలకు కనువిందు చేయనున్నాడు. దీనిని బ్లడ్ మూన్ ఎక్లిప్స్ అని పిలుస్తారు. నాసా ప్రకారం, భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని ప్రజలు ఈసారి చాలాసేపు హాయిగా చూసేయెచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
చంద్రగ్రహణం ఎక్కడెక్కడ ఉంటుంది?
వర్షం పడకుండా ఆకాశం స్పష్టంగా ఉంటే, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాతో సహా భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రజలకు చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇంకా యాంగోన్, షాంఘై, జోహన్నెస్‌బర్గ్, లాగోస్, కైరో, బ్యాంకాక్, జకార్తా, బెర్లిన్, మాస్కో, సియోల్, రోమ్, ఢాకా, బుడాపెస్ట్, మనీలా, ఏథెన్స్, సింగపూర్, మెల్‌బోర్న్, బుకారెస్ట్, సిడ్నీ, సోఫియా, టోక్యో, బీజింగ్, అంకారా, బ్రస్సెల్స్, ఆమ్‌స్టర్‌డామ్, పారిస్, లండన్, మాడ్రిడ్‌లోని ప్రజలు బ్లడ్ మూన్ స్పష్టంగా చూడగలరు.
సాధారణంగా చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 85 శాతం మంది ప్రజలకు బ్లడ్ మూన్ వీక్షించే అరుదైన అవకాశం దక్కబోతోంది. భారతదేశంలో ఈ సంవత్సరం రెండవ, చివరి చంద్రగ్రహణం ఆదివారం వస్తోంది. దేశంలో ఎక్కడి నుంచైనా ప్రజలు చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం, ఇవాళ చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు మొదలై రాత్రి 2 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది.
గ్రహణం ప్రారంభ సమయం: రాత్రి 8:58 గంటలకు
పాక్షిక గ్రహణం ప్రారంభం: రాత్రి 9:57 గంటలకు
సంపూర్ణ గ్రహణం ప్రారంభం: రాత్రి 11:00 గంటలకు
చంద్రుడు అత్యంత ఎర్రగా మారే సమయం: రాత్రి 11:41 గంటలకు
సంపూర్ణ గ్రహణం ముగింపు: సెప్టెంబర్ 8, 2025, ఉదయం 12:22 గంటలకు
పాక్షిక గ్రహణం ముగింపు: సెప్టెంబర్ 8, 2025, ఉదయం1:26 గంటలకు
గ్రహణం ముగింపు: సెప్టెంబర్ 8, 2025, ఉదయం 2:25 గంటలకు
సంపూర్ణ గ్రహణం యొక్క వ్యవధి: 82 నిమిషాలు (రాత్రి 11:00 నుండి 12:22 వరకు)
మొత్తం ఈవెంట్ వ్యవధి: సుమారు 3 గంటల 28 నిమిషాలు
బ్లడ్ మూన్ దేశమంతటా కనిపించినా హిమాచల్ ప్రదేశ్, లడాఖ్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్ వంటి ప్రాంతాల్లో తక్కువ వాయు కాలుష్యం కారణంగా మరింత స్పష్టంగా కనిపించవచ్చు. కాంతి కాలుష్యం వల్ల హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో సిటీల్లో కొంత అస్పష్టంగా ఉండే అవకాశం ఉంది.
చంద్రగ్రహణం వంటి ఖగోళ అద్భుతాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అబ్జర్వేటరీలు (Observatories) తరచూ పర్యవేక్షిస్తుంటాయి. ఈ తరహా గ్రహణాలను టెలిస్కోప్, బైనాక్యులర్, లేదా నేరుగా కళ్లతోనూ స్పష్టంగా వీక్షించవచ్చు. మీ దగ్గర టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ ఉంటే, చంద్రుడిపై జరిగే మార్పులను మరింత దగ్గరగా, స్పష్టంగా చూడవచ్చు.
ఇవి కూడా చదవండి..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
ఈ కోతి మరీ ఫన్నీ గురూ.. కళ్లద్దాలను కొట్టేసి.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి