Share News

US Operation SEAL: ఉత్తర కొరియాలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:56 PM

కిమ్‌కు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని నిరోధించేందుకు ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలని అగ్రరాజ్యం భావించింది. అత్యంత రహస్యంగా ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన నేవీ సీల్ టీమ్ 6 రెడ్ స్క్వాడ్రన్‌కు ఈ బాధ్యత అప్పగించింది.

US Operation SEAL: ఉత్తర కొరియాలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్
Kom Jong Un with Donald Trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donal Trump), ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) 2019లో వియత్నాంలో దౌత్య చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా ఒక రహస్య ఆపరేషన్‌ను చేపట్టిందట. ఉత్తర కొరియాలో కిమ్‌కు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని నిరోధించేందుకు ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలని అగ్రరాజ్యం భావించింది. అత్యంత రహస్యంగా ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన నేవీ సీల్ టీమ్ 6 రెడ్ స్క్వాడ్రన్‌కు ఈ బాధ్యత అప్పగించింది. అయితే, ఈ ఆపరేషన్‌ అమలు చేసే క్రమంలో ఓ మత్స్యకార బోటు రావడం, కమాండోలు జరిపిన కాల్పుల్లో అందులోని వారు ప్రాణాలు కోల్పోవడంతో ఆ పరికరాన్ని అమర్చకుండానే 'సీల్' టీమ్ వెనుదిరగడం జరిగింది. దీంతో ఈ ఆపరేషన్ అమెరికా నిలిపివేసినట్టు 'ది న్యూయార్క్ టైమ్స్' తాజా కథనంలో పేర్కొంది.


నాకేమీ తెలియదు

నార్త్ కొరియాలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించడంపై డొనాల్డ్ ట్రంప్‌ను మీడియా శుక్రవారం నాడు ప్రశ్నించినప్పుడు దాని గురించి తనకేమీ తెలియదని చెప్పారు. ఈ మిషన్ గురించి తాను వినడం ఇదే మొదటిసారని అన్నారు.


ఆపరేషన్ జరిగిందిలా..

కిమ్ ప్రైవేటు సమాచారాన్ని నిరోధించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలని అమెరికా భావించిందనేది ది న్యూయార్క్ టైమ్స్ కథనం. ఇది రిస్క్‌తో కూడిన ఆపరేషన్ అయినందున అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరని, అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఇందుకు ఆమోదించారని సమాచారం. ఉత్తర కొరియా సరిహద్దు ఆంక్షలు విధించడం సీల్‌కు సవాలుగా మారిందట. అయినప్పటికీ కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేసిన సీల్ టీమ్ రంగంలోకి దిగింది. బ్లాక్ సూట్‌లు, నైట్ విజన్ అద్దాలు, నిఘాకు చిక్కని ఆయుధాలతో ఉత్తర కొరియా తీరానికి చేరింది. అయితే అనూహ్యంగా అటువైపు చేపలు పట్టే బోటు ఒకటి వచ్చింది. దీంతో మిషన్ కమాండర్‌తో కమ్యూనికేషన్ పంచుకునే అవకాశం లేకపోవడంతో సీల్ టీమ్ ఆ బోటుపై కాల్పులు జరిపింది. అందులో ఉన్న అందరినీ కాల్చిచంపింది. మృతదేహాలను ఛిద్రం చేసి నీటిలో పడేసింది. మిషన్‌ను రద్దు చేసి ఎలక్ట్రానికి పరికరాన్ని అమర్చుకుండానే వెనుదిరిగింది. ఆ తర్వాత వియత్నాం సదస్సులో కిమ్‌తో ట్రంప్ చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో నార్త్ కొరియా మేలో క్షిపణి పరీక్షలు తిరిగి ప్రారంభించింది.


కాగా, ఈ ఆపరేషన్ గురించి ట్రంప్ యంత్రాంగం అమెరికా కాంగ్రెస్‌లోని కీలక సభ్యులకు కూడా తెలియజేయలేదట. 2019 మిషన్‌పై తాజా కథనం వెలువడేంత వరకూ బయట ప్రపంచానికి ఈ విషయం తెలియదు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారిని ఆ తర్వాత ప్రమోట్ చేశారని సమాచారం. అయితే ఈ మిషన్‌పై ఇన్వెస్టిగేషన్ చేపట్టడంతో 2021లో బైడెన్ యంత్రాంగం కాంగ్రెస్ కీలక సభ్యులతో ఈ ఆపరేషన్‌ గురించి టూకీగా వివరించారట. అయితే ఇన్వెస్టిగేషన్‌లో ఏమి తేలిందనేది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది.


ఇవి కూడా చదవండి..

రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం

అక్టోబర్‌లో దక్షిణ కొరియా పర్యటనకు ట్రంప్!, జిన్‌పింగ్‌తో భేటీకి ప్రయత్నాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 07 , 2025 | 05:17 PM