IT Sector - Trump Tariffs: భారత ఐటీ రంగంలో ఆందోళన.. అమెరికాతో చర్చలు జరుపుతున్నామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:36 PM
భారత ఐటీ పరిశ్రమను కాపాడుకునేందుకు వివిధ దేశాలు, ఎమ్ఎన్‌సీలతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ భరోసా ఇచ్చారు. దేశీయంగా డిమాండ్ మెరుగు పరిచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ఐటీ పరిశ్రమ అభివృద్ధిని కాపాడుకునేందుకు బహుళజాతి కార్పొరేట్ సంస్థలు, విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Minister Ashwini Vaishnaw) తెలిపారు. ఐటీ ఔట్ సోర్సింగ్‌కు కూడా బ్రేకులు వేస్తామంటూ ట్రంప్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కామెంట్స్ చేస్తున్న తరుణంలో మంత్రి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు (India US outsourcing crackdown).
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలో నెలకొన్న భయాలపై స్పందించారు. భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), సర్వీస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని అన్నారు. ‘అమెరికా, యూరప్, జపాన్, ఇతర ఆసియా దేశాలతో చర్చలు జరుపుతున్నాము. భారత్‌లో అత్యధిక నాణ్యత గల ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఐటీ రంగంలో వృద్ధి ఎప్పటిలాగే కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నాము’ అని తెలిపారు (Trump outsourcing tariffs threat).
300 బిలియన్ డాలర్ల విలువైన భారత ఐటీ పరిశ్రమ సుమారు 5.67 మిలియన్‌ల మందికి ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. భారత ఎగుమతుల్లో ఐటీ ఉత్పత్తుల వాటా ప్రధానమైనది. అయితే, భారత ఐటీ సంస్థలు అమెరికా క్లయింట్స్‌కు ఐటీ సేవలను అధికంగా ఎగుమతి చేస్తున్నాయి. ఇలా పొరుగు దేశాల నుంచి వచ్చే ఐటీ సేవలకు ముగింపు పలకాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని ట్రంప్ ప్రభుత్వంలో కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఐటీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
అయితే, ఐటీ ఎగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడటం లేదని మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ‘ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ చాలా పెరిగింది. మన స్మార్ట్ ఫోన్ మార్కెట్ వాటా పెరిగింది. ఈ సప్లై చైన్ మొత్తం భారత్‌లో ఏర్పాటయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అని తెలిపారు. ప్రస్తుతమున్న ఉద్యోగాలను కాపాడుకోవడంతో పాటు దేశీయంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడి వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇటీవల 280 బిలియన్ డాలర్ల భారత ఐటీ రంగాన్ని టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టడంతో ఈ చర్చ మొదలైంది. విదేశాల్లో ఉంటూ అమెరికాలో ఐటీ సేవలు అందించే వర్కర్‌లపై సుంకాలు విధించాలని అన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న ఆందోళన నెలకొంది.
ఇవి కూడా చదవండి
మహిళా అధికారులంటే నాకెంతో గౌరవం: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News