Prayagraj Special Day : మీరు కుంభమేళాకు వెళ్తున్నారా..ఈ రోజున గంగా జలం అమృతమే..
ABN , Publish Date - Jan 27 , 2025 | 11:43 AM
భారతీయ హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ ప్రత్యేకమైన రోజున గంగా జలం అమృతంగా మారుతుందని భావిస్తారు. ఇలాంటి రోజున త్రివేణి సంగమంలోని పవిత్ర జలాల్లో స్నానం ఆచరించిన వారి అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు..
Maha Kumba Mela 2025: కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడాన్ని ఎల్లప్పుడూ పవిత్రంగానే పరిగణిస్తారు. అయితే, మౌని అమావాస్యనాడు చేసే పవిత్ర స్నానానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుంభమేళా జరిగిన రోజులన్నింటిలో అత్యంత పవిత్రమైన రోజులలో మౌని అమావాస్య కూడా ఒకటి. రోజు చాలా శక్తివంతమైనదని నమ్ముతారుయ. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో అమావాస్య రోజున మౌని అమావాస్య వస్తుంది. ఈ రోజున గంగా, యమునా మరియు సరస్వతి నదుల (త్రివేణి సంగమం) సంగమంలో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధి అవుతుందని, అన్ని పాపాలను తొలగిపోతాయని అంటారు. మౌని అమావాస్య నాడు ఉపవాసం, ధ్యానం, దానధర్మాలు లాంటివి చేయడం పుణ్యప్రదమని పురాణాల్లో చెప్పబడింది. ఎందుకంటే, మౌని అమావాస్య రోజున చేసే కార్యాలు అపారమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిస్తాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఈ సారి జరుగుతున్న మహాకుంభమేళా అత్యంత పవిత్రమైనది.144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన ఖగోళ అమరిక ద్వారా వచ్చిన ఈ కుంభమేళా ఆధ్యాత్మికపరంగా ఎంతో విశిష్టమైనది.
అమృత్ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత?
మహా కుంభమేళా సమయంలో అమృత స్నానానికి అత్యంత ప్రాముఖ్యతమైనది. కుంభమేళా పూర్తయ్యేలోగా 6 అమృత స్నానాలు ఉంటాయి. ప్రతి ఒక్కదానిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రత్యేకమైన రోజులలో రావడమే ఇందుకు కారణం. మకర సంక్రాంతి నాడు జరిగిన అమృత స్నాన్తో సమానంగా మౌని అమావాస్య అమృత స్నాన్‌ను పరిగణిస్తారు. ఈ రోజున ఋషులు, సాధువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ అమృత స్నాన్ సమయంలోనే నాగ సాధువులకు దీక్ష కూడా ఇస్తారు. అదే మౌని అమావాస్య ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది.
మౌని అమావాస్య ప్రత్యేకతలివే..
మౌని అమావాస్య 2025 జనవరి 29న జరుపుకుంటారు. ఈ రోజునే మహాకుంభమేళాలో రెండవ అమృత స్నాన్ జరుగుతుంది. కుంభమేళా సమయంలో అమృత స్నానం ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా విశ్వసిస్తారు. మౌని అమావాస్య రోజుకు జరిగే అమృతస్నాన్‌కు మరింత ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఈ రోజున మహాకుంభ సమయంలో త్రివేణి సంగమంలోని పవిత్ర జలాలతో స్నానం చేయడాన్ని అమృతతుల్యంగా భావిస్తారు.
హిందూ పురాణాలు ప్రకారం మౌని అమావాస్య నాడు అమృత స్నానం చేయడాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున నాగ సాధువులు దండి కింద దీక్షను స్వీకరిస్తారు. మౌని అమావాస్య రోజున చంద్రుడిని పూజించడం వల్ల జాతకం బలపడుతుందని నమ్ముతారు. ఈ ప్రత్యేక సందర్భంలో పితృ పూజ చేసి పూర్వీకులను గౌరవిస్తే వారి ఆశీర్వాదాలు దక్కి కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శివుని ఆరాధనకు, తాంత్రిక అభ్యాసాలు, మంత్ర సాధన, మంత్రాలను పఠించడానికి అత్యంత పవిత్రమైన రోజు ఇదే.