Thackeray Cousins Reunite: బీఎంసీ ఎన్నికల వేళ చేతులు కలిపిన ఠాక్రే సోదరులు
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:49 PM
శివసేన యూబీటీ, ఎంఎన్‌ఎస్ కలిసికట్టుగా మరాఠా ప్రజల ప్రయోజనాల కోసం బీఎంసీ ఎన్నికలకు వెళ్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు
ముంబై: బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సహా పలు మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరుగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు తిరిగి చేతులు కలిపారు. కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్తున్నామనీ, ఇక ఎప్పటికీ కలిసే ఉంటామని సంయుక్తంగా ప్రకటించారు. వోర్లిలోని హోటల్ బ్లూ సీలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన మీడియా సమావేశంలో శివసేన యూబీటీ (Shiv Sena UNT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కజిన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే కలిసి పాల్గొన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, శివసేన యూబీటీ, ఎంఎన్‌ఎస్ కలిసికట్టుగా మరాఠా ప్రజల ప్రయోజనాల కోసం బీఎంసీ ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించారు. మరాఠా ప్రజలు కలిసికట్టుగా ఉండాలని, కలిసి ఉంటేనే బలమని, విభజన జరిగితే బలహీన పడే ప్రమాదముందని హెచ్చరించారు. ఓట్ల డివిజన్ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముంబైని ధ్వంసం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. అయితే మరాఠా ప్రజలకు ముంబై దక్కకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబై మనతోనే ఉండాలని పిలుపునిచ్చారు.
మరాఠా వ్యక్తికే ముంబై మేయర్ పదవి
మారాఠా వ్యక్తే మంబై మేయర్ పదవి దక్కాలని రాజ్ ఠాక్రే అన్నారు. అది తన పార్టీ నుంచి అయినా, తన కజిన్ ఉద్ధవ్ పార్టీ నుంచి అయినా ఉంటుందని చెప్పారు. మరాఠా ప్రజలు సహజంగా ఎవరినీ ఇబ్బంది పెట్టరని, ఎవరైనా తమ మార్గంలో అడ్డువస్తే ఎంతమాత్రం సహించరని చెప్పారు. మహారాష్ట్ర ప్రయోజనాల ముందు తమ మధ్య ఉన్న విభేదాలు ముఖ్యం కాదని తాను గతంలోనూ చెప్పానని, ఈరోజు నుంచి కలిసికట్టుగా తమ ప్రయాణం సాగుతుందన్నారు. ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది తరువాత ప్రకటిస్తామని చెప్పారు. మీడియా సంయుక్త సమావేశంలో సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రే సైతం పాల్గొన్నారు.
బీజేపీ విమర్శ
శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ చేతులు కలపడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. నిరాశానిస్పృహల కారణంగానే రెండు పార్టీలు కలిసాయని, ఠాక్రే కూటమికి ఒక విజన్ అంటూ ఏమీ లేదని ఆ పార్టీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. కుటుంబ వారసత్వాన్ని, రాజకీయ ఉనికికి కాపాడేందుకు ఠాక్రే సోదరులు చేస్తున్న చిట్టవరికి ప్రయత్నం ఇదని విమర్శించారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, మహాయుతి చారిత్రక విజయాలు సాధించడంతో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే చిరకాల శత్రువులు ఇప్పుడు చేతులు కలుపుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి..
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి