Share News

Vinod Kumar Shukla: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా కన్నుమూత

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:35 PM

ప్రఖ్యాత హిందీ రచయిత, 2025 జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా ఇకలేరు. వయోభారం కారణంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కమారుడు తెలిపారు.

Vinod Kumar Shukla: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా కన్నుమూత
Vinod Kumar Shukla

ఇంటర్నెట్ డెస్క్: ప్రసిద్ధ హిందీ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా కన్నుమూశారు. 88 ఏళ్ల శుక్లా వయో సంబంధిత అనారోగ్యం కారణంగా మంగళవారం తుది శ్వాస విడిచారు. హిందీ సాహిత్యంలో ప్రసిద్ధి గాంచిన శుక్లాను భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్ వరించింది.


కళ్లకు కట్టే రచనలతో..

వినోద్ కుమార్ శుక్లా 1937 జనవరి 01న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జన్మించారు. చిన్ననాటి నుంచి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్న ఆయన.. అందులో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నారు. ఖిలేగా తో దేఖేంగే, ఏక్‌ చుప్పీ జగాహ్‌, దీవార్‌ మే ఏక్‌ ఖిర్కీ రహతీ థీ, నౌకర్‌ కీ కమీజ్ మొదలగు నవలలను రచించారు శుక్లా. సాధారణ వ్యక్తుల భావోద్వేగాలను తన రచనల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరిస్తారని ఆయనకు పేరుంది. 'దీవార్‌ మే ఏక్‌ ఖిర్కీ రహతీ థీ' రచనకు గానూ 1999లో సాహిత్య అకాడమీ అవార్డు పొందారు శుక్లా. ఆయన ప్రతిభను మెచ్చి.. ఈ ఏడాది 59వ జ్ఞాన్‌పీఠ్‌ అవార్డుకు ఎంపికయ్యారు.


ఇటీవల శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో ఈ నెల 2న రాయ్‌పుర్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించినట్టు ఆయన కుమారుడు శశ్వంత్ తెలిపారు. అయితే.. చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారన్నారు. శుక్లా మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. హిందీ సాహిత్యానికి ఆయన చేసిన సేవ చిరకాలం గుర్తుండిపోతుందన్నారు మోదీ.


ఇవీ చదవండి:

పరీక్షలో ఆ ప్రశ్న అడిగినందుకు ప్రొఫెసర్ సస్పెండ్.. ఎక్కడంటే?

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

Updated Date - Dec 24 , 2025 | 12:39 PM