Share News

Professor Suspend: పరీక్షలో ఆ ప్రశ్న అడిగినందుకు ప్రొఫెసర్ సస్పెండ్.. ఎక్కడంటే?

ABN , Publish Date - Dec 24 , 2025 | 07:57 AM

జేఎంఐ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ విద్యార్థులకు జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో తీవ్ర వివాదం చెలరేగింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రశ్న అడిగారనే కారణంగా ఏకంగా ఓ ప్రొఫెసర్ సస్పెండ్ అయ్యాడు. వివరాల్లోకెళితే...

Professor Suspend: పరీక్షలో ఆ ప్రశ్న అడిగినందుకు ప్రొఫెసర్ సస్పెండ్.. ఎక్కడంటే?
JMI University Question Paper

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ(Delhi)లోని జామియా మిలియా ఇస్లామియా(JMI) యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ సస్పెండ్ అయ్యారు. కాలేజీ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఓ ప్రశ్న అడిగారనే నెపంతో ఇలా ఉద్వాసనకు గురయ్యారు(Professor Suspended). ఈ విషయమై దర్యాప్తు నిమిత్తం.. విశ్వవిద్యాలయం ఓ విచారణ కమిటీని ఆదేశించినట్టు అక్కడి అధికారులు తెలిపారు.


అసలేం జరిగిందంటే.?

జేఎంఐ విశ్వవిద్యాలయంలో(JMI University) ఈ వారం ప్రారంభంలో బీఏ(ఆనర్స్) విభాగం అభ్యర్థులకు పరీక్షలు జరిగాయి. అందులో భాగంగా.. సోషల్ వర్క్(Social Work) ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలోని 'భారతదేశంలో సామాజిక సమస్యలు' అనే పేపర్‌కు సంబంధించిన క్వశ్చన్ పేపర్‌ను ప్రొఫెసర్ వీరేంద్ర బాలాజీ షహరే(Pro. Veerendra Balaji Shahare) రూపొందించారు. అందులో 'దేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను చర్చించేందుకు తగిన ఉదాహరణలివ్వండి.' అనే ప్రశ్నను ఇచ్చి.. దానికి 15 మార్కులు కేటాయించారు. ఈ క్వశ్చన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వచ్చాయని యూనివర్సిటీ పేర్కొంది. ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ దుమారం రేగడంతో వివాదానికి ఆజ్యం పోసినట్టైంది. దీంతో ఆగ్రహించిన విశ్వవిద్యాలయ యాజమాన్యం వెంటనే సదరు ప్రొఫెసర్‌ను విధుల నుంచి బహిష్కరించింది.


ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ విచారణ కమిటీని కూడా నియమించినట్టు తెలిపారు యూనివర్సిటీ అధికారులు. కమిటీ ఈ విషయమై అంతర్గతంగా పరిశీలించి.. తన నివేదికను సమర్పించడం సహా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆ ప్రొఫెసర్‌ సస్పెన్షన్ కొనసాగనుందని పేర్కొన్నారు. విద్యా బాధ్యతలు, సంస్థాగత క్రమశిక్షణను నిలబెట్టడంలో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించామన్నారు.

సంబంధిత ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా(Kanchan Gupta) సైతం ఎక్స్ వేదికగా సస్పెన్షన్ నోటీస్‌ను షేర్ చేయడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది.


ఇవీ చదవండి:

బిహార్‌ ప్రగతి అబ్బురపరుస్తోంది.. ఎన్డీయే ప్రభుత్వంపై శశిథరూర్ ప్రశంసలు

దీపూదాస్‌ను అన్యాయంగా చంపేశారు.. ఆడియో సందేశంలో షేక్ హసీనా

Updated Date - Dec 24 , 2025 | 07:57 AM